‘డెయిరీ కార్మికులకు న్యాయం చేస్తాం’
అక్కిరెడ్డిపాలెం: ప్రభుత్వ జీవోలు, చట్టాల ప్రకారం కార్మికులకు న్యాయం చేస్తామని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్ హామీ ఇచ్చారు. వామపక్ష నేతలతో కలిసి విశాఖ డెయిరీ కార్మికులు బుధవారం చైర్మన్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని నినదించారు. దీంతో చైర్మన్ ఆనంద్‌కుమార్ కార్మికుల వద్దకు వెళ్లారు. యూనియన్ నాయకులు కార్మికుల డిమాండ్‌లను వివరిస్తుండగా.. ఆనంద్ కుమార్ వాటికి వివరణ ఇచ్చారు. ప్రభుత్వ విధానాలు, జీవోల ఆధారంగా కార్మికుల హక్కులను అమలు చేస్తామని సమాధానమిచ్చారు. కార్మికులను పర్మినెంట్ చేసే అంశంపై కమిటీ(కార్మికులు, డైరెక్టర్లు) వేసి.. చర్చల ద్వారా నిర్ణయం తీసుకుంటామన్నారు. జీతాలు పెంచే అంశం కూడా సులభంగా తీసుకునే నిర్ణయం కాదన్నారు. దీనికి సీనియారిటీ రికార్డుల పరిశీలన చేస్తామన్నారు. ప్రసూతి సెలవులను విధివిధానాల ప్రకారం అమలు చేస్తామన్నారు. కాగా.. యాజమాన్య, యూనియన్ ప్రతినిధులు త్వరలో సమావేశమై.. కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం చర్చలు జరపడానికి అంగీకరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాజువాక ఏసీపీ టి.త్రినాథ్, సీఐ పార్థసారథి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment