హన్నా... గెలుపు మిన్న | - | Sakshi
Sakshi News home page

హన్నా... గెలుపు మిన్న

Published Sat, Oct 26 2024 1:54 AM | Last Updated on Sat, Oct 26 2024 4:35 PM

హన్నా రాథోడ్‌

హన్నా రాథోడ్‌

ఆత్మవిశ్వాసంతోనే అసాధారణ స్థాయికి

స్పెయిన్‌లో శాస్త్రవేత్తగా రాణింపు 

2023లో ‘మిస్‌ వరల్డ్‌ ట్రాన్స్‌’ పోటీల్లో రన్నరప్‌ 

నవంబర్‌లో మిస్‌ యూనివర్స్‌ ట్రాన్స్‌ పోటీలకు సిద్ధం 

హన్నా రాథోడ్‌ స్ఫూర్తిదాయక ప్రస్థానం

మాది అనంతపురం రూరల్‌ పరిధిలోని సోములదొడ్డి గ్రామం. నాన్న మల్లేష్‌, అమ్మ పద్మావతికి మూడో సంతానంగా పుట్టాను. ఓ అన్న, అక్క ఉన్నారు. నాకు ఆనంద్‌బాబు అని పేరుపెట్టారు. అమ్మ, నాన్న అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్‌లో పండ్ల వ్యాపారం చేసేవారు. పేదరికం కారణంగా పస్తులతో గడిపిన రోజులెన్నో చూశా. దీంతో బడికి వెళ్లే సమయంలోనే ఏ మాత్రం వీలు చిక్కినా ఊళ్లో కూలి పనులకు, అమ్మ, నాన్నతో కలసి పండ్ల వ్యాపారం చేస్తూ వచ్చా. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు నాలో శారీరక మార్పులు గుర్తించా. సమాజానికి తెలిస్తే బయటకు గెంటేసి హేళన చేస్తారేమోనని భయపడ్డా. దీంతో ఎవరితోనూ చెప్పుకోలేదు. చిన్న కొడుకు కావడంతో మా అమ్మ నన్ను ఎంతో గారాబంతో పెంచుతూ వచ్చింది.

నా వెనుక గేలి చేసేవారు

సమాజంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న వివక్ష నన్ను చాలా భయపెట్టేది. ఇలాంటి సమయంలో కేవలం చదువు ఒక్కటే నా సమస్యకు చక్కటి పరిష్కారమని గుర్తించాను. దీంతో పట్టుదలగా చదువుకుంటూ క్లాస్‌లో టాపర్‌గా నిలుస్తూ వచ్చా. ఇంటర్‌ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు మీడియం చదివిన నేను ఆ తర్వాత అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీ–ఫార్మసీ చేశా. అక్కడ చాలా మంది స్నేహితులు ఉండేవారు. వారిలో కొందరు నా ముందు ఏమీ అనకపోయినా... నా వెనుక చెడుగా మాట్లాడుకునేవారని తెలిసి బాధపడ్డాను. జన్యుపరమైన లోపాన్ని ఎవరూ గుర్తించలేదు. గేలి చేసినా కుంగిపోలేదు. పట్టుదలతో బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ పూర్తి చేశా.

పెళ్లి ప్రయత్నాల నుంచి బయటపడి

ఎం–ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో ఎంఎస్‌ చేయాలని అనుకున్నా. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా రెండేళ్లు పనిచేశా. అదే సమయంలో జూనియర్‌ ఫార్మసీ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చిన డబ్బును దాచుకుని విదేశీ విద్యావకాశాలపై అన్వేషిస్తూ వచ్చా. ఈ లోపు అనంతపురం కలెక్టరేట్‌లో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తెలియగానే చాలా మంది అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయకూడదని భావించిన నేను... విదేశాలకు వెళ్లిపోతే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయనుకున్నా. అదే సమయంలో విదేశీ విద్యావకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్ష రాసి మెరుగైన ఫలితాలతో స్పెయిన్‌లో ఎంఎస్‌ సీటు దక్కించుకున్నా. కోర్సు పూర్తి కాగానే అక్కడే బయో ఇంజినీరింగ్‌ సొల్యూషన్స్‌లో శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం వచ్చింది. శాస్త్రవేత్తగా స్థిరపడిన తర్వాత 2021లో ట్రాన్స్‌ఫ్యూజన్‌ ఆపరేషన్‌ చేయించుకుని హన్నారాథోడ్‌గా పేరు మార్చుకుని ఇంట్లో వారికి విషయం చెప్పా.

చదువే సెలబ్రిటీని చేసింది

ట్రాన్స్‌జెండర్ల జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. మన వ్యక్తిత్వం చెదరకుండా కాపాడుకోవాలి. ఎలాంటి వ్యక్తికై నా ప్రతికూల కాలమంటూ ఉంటుంది. నిరాటంకంగా అవరోధాల్ని అధిగమించి విజయం సాధిస్తే ఈ సమాజమే గౌరవప్రదంగా చూస్తుంది. మనం కోరకుండానే వచ్చే జన్యుపరమైన లోపాలకు కుంగిపోరాదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ధర్మాన్ని, దైవాన్ని నిందించడం కూడా పొరబాటే. అసలు ప్రతికూలతల్లో కూడా అనుకూలతను వెదికి అనుకూలంగా మలచుకునే యుక్తిని సాధించగలగాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. నా జీవితమే ఇందుకు నిదర్శనం. చదువే ననున్న సెలబ్రిటీని చేసింది. ఈ స్థాయికి నేను ఎదగడంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు వివరిస్తూ తెలుగు, ఇంగ్లిష్‌, స్పానిష్‌ మూడు భాషల్లో పుస్తకం రచిస్తున్నా. త్వరలో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువస్తా.

మిస్‌ వరల్డ్‌ పోటీల్లో ప్రతిభ

గతేడాది స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో మిస్‌ వరల్డ్‌ ట్రాన్స్‌–2023 పోటీలు జరిగాయి. అక్కడే పనిచేస్తున్న నాకు ఈ విషయం తెలిసి భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు దరఖాస్తు చేసుకున్నా. దీంతో నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. ఈ పోటీలో ఏకంగా రన్నరప్‌గా నిలవడంతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. దీంతో సేవా కార్యక్రమాలు చేపట్టి ట్రాన్స్‌ సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించాను. ఆ దిశగా తొలి ప్రయత్నం చేశాను. ఇందు కోసం స్పెయిన్‌లోని కొన్ని కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపాను. ట్రాన్స్‌ సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్న వారి సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి నవంబర్‌లో న్యూఢిల్లీలో మిస్‌ యూనివర్స్‌ ట్రాన్స్‌ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. ఈ పోటీల్లో పాల్గొనడానికే ఇండియాకు వచ్చా. ఇక్కడ మా ఊరి ప్రజలు నన్ను చూసి చాలా సంతోష పడ్డారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనే చీఫ్‌ గెస్ట్‌. ఇంతకంటే గౌరవం ఏమి కావాలి?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement