పింఛన్ కోసం పడిగాపులు
అనంతపురం క్రైం/ అనంతపురం కార్పొరేషన్: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో వేకువజాము నుంచే లబ్ధిదారుల ఇంటికెళ్లి పింఛన్ అందజేసేవారు. కూటమి పాలనలో అందుకు భిన్నంగా సాగుతోంది. శుక్రవారం అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో పింఛన్ల పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో లబ్ధిదారులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. హౌసింగ్ బోర్డులోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం వద్దకు లబ్ధిదారులను పిలిపించుకుని పింఛన్ పంపిణీ చేయడం గమనార్హం. వినాయకనగర్, పాతూరు, వేణుగోపాల్‌నగర్, రామ్‌నగర్, ఆదర్శనగర్, నాయక్‌నగర్, సాయినగర్, తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కూడా ఆలస్యంగానే పంపిణీ కొనసాగింది. జిల్లాలో 2,82,554 మంది పింఛన్‌దారులకు రూ.123,99,52,500 మంజూరైంది. తొలిరోజు 2,52,104 మందికి రూ.110,40,74,500 సొమ్మును పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య తెలిపారు.
‘తమ్ముళ్ల’ పెత్తనం
ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు సచివాలయ సిబ్బంది వెన్నులో వణుకు పుడుతోంది. సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం కాస్తా టీడీపీ కార్యక్రమంగా మారింది. కలెక్టర్, మండల స్థాయి అధికారులు లేదా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ చేపట్టవచ్చు. అలా కాకుండా అధికార పార్టీలో ఉన్న అనామకులు, ప్రజాప్రతినిధులు కాని వారిని ముందు పెట్టి కార్యక్రమం చేపడుతున్నారు. అనంతపురం శివారులోని ఎ.నారా యణపురం పంచాయతీలో టీడీపీ నేత రాయల్ మురళి, కార్యకర్త గాజుల ముత్యాలన్న సచివాలయ సిబ్బందిని సైతం వెనక్కునెట్టి అంతా తామై హడావుడి చేయడం చూసి జనం ముక్కున వేలేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment