ఉమ్మడి జిల్లా అంతటా కరువే
అనంతపురం కార్పొరేషన్: ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నందున అన్ని మండలాలనూ కరువు జాబితాలో చేర్చాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లాలో 7, శ్రీసత్యసాయి జిల్లాలో 10 కలుపుకుని మొత్తం 17 కరువు మండలాలుగా ప్రకటించి, మిగతా 46 మండలాలను విస్మరించారని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. కరువు మండలాల నిర్ధారణకు ప్రభుత్వం తీసుకున్న ప్రామాణికాలు రైతులను ఆర్థికంగా దెబ్బతీసేవిగా ఉన్నాయన్నారు. జూన్‌లో సకాలంలో వర్షం వచ్చినా.. జూలై నుంచి ఆగస్టు 20 వరకు దాదాపుగా 55 రోజులు జిల్లాలో ఎక్కడా వర్షం రాలేదన్నారు. ఖరీఫ్‌లో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో సరాసరి తీసుకుని 35 మిల్లీలీటర్లు అధికంగా వచ్చాయని, కేవలం కొన్ని మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించారని అన్నారు. నాడు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. నేడు కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకునే విషయంలో అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
మంత్రులు ప్రత్యేక చొరవ చూపాలి
గతేడాది 2023–24 ఖరీఫ్‌లో రైతులకు బీమా వచ్చిందని, ఎన్నికల కోడ్ కారణంగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోయిందని అనంత అన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది ఇన్‌పుట్ సబ్సిడీ మాట ఎత్తకుండా ఉమ్మడి జిల్లా రైతులకు చంద్రబాబు ద్రోహం చేశారన్నారు. 46 మండలాలకు బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ అందకుండా చేసిన పాపం ఆయనదేనన్నారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటన చేయించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడితే విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజాప్రతినిధులంతా రైతులను ఆదుకునేలా సీఎం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలి
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ను 45.72 మీటర్ల ఎత్తుతోనే నిర్మిస్తామని ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని, లేనిపక్షంలో మరోసారి కూటమి పార్టీలు, ప్రజాప్రతినిధులు రాష్ట్రానికి ద్రోహం చేసినవారవుతారని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉంటే సుమారు 195 టీఎంసీల నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా ప్రాజెక్ట్ ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేయడం ద్వారా గరిష్టంగా 115 టీఎంసీలు మాత్రమే నిల్వ అవుతుందన్నారు. ఇదే జరిగితే పోలవరం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనమూ లేకుండా పోతుందన్నారు. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు నాగార్జున సాగర్‌కు వెళ్తున్నాయని, పోలవరం పూర్తయితే ఆ నీటిని రాయలసీమ ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వంపై అనేక విమర్శలు చేశారని, కానీ నేడు ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించేలా నిర్ణయం తీసుకున్నా కూటమి ప్రజాప్రతినిధులు ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించారు.
పూర్తిగా దెబ్బతిన్న ఖరీఫ్ పంటలు
అన్ని మండలాలనూ కరువు జాబితాలో చేర్చాలి
క్షేత్రస్థాయిలో పరిశీలించి.. వాస్తవాలు తెలుసుకోండి
రైతులను ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment