వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో పనిచేయాలి
అనంతపురం అర్బన్: భిన్నత్వంలో ఏకత్వం అని చాటిన మహనీయుడు, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తితో అందరూ పనిచేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. దివంగత ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడిన వల్లభాయ్ పటేల్ సంకల్పాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులు, ఉద్యోగులతో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, విభాగాధిపతులు వసంతలత, రియాజుద్ధీన్, యుగేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్లు కనకరాజు, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
డెంగీ లక్షణాలతో
చిన్నారి మృతి
ఉరవకొండ: మండల కేంద్రం ఉరవకొండలోని శివరామిరెడ్డి కాలనీలో నివాసముంటున్న మారుతి, మహేశ్వరి దంపతుల కుమార్తె ఆరాధ్య (7) డెంగీ లక్షణాలతో గురువారం మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. ఆరాధ్యకు 10 రోజుల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో బళ్లారికి తీసుకెళ్లి చూపించగా.. వైద్య పరీక్షల్లో డెంగీ జ్వరమని, ప్లేట్‌లైట్స్ తగ్గాయని తేలింది. అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి గురువారం ఆస్పత్రిలోనే మృతి చెందింది. ఒక్కగానొక్క కుమార్తె మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
బాలల సంస్థలకు
రిజిస్ట్రేషన్ తప్పనిసరి ●
● జిల్లా పర్యవేక్షణ అధికారి ఫారూక్‌బాషా
అనంతపురం/సెంట్రల్: జువైనల్ జస్టిస్ యాక్ట్–2015 ప్రకారం పిల్లల సంరక్షణ, సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులు, బాలల సంరక్షణ కేంద్రాలకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బాలల సంక్షేమం, సంస్కరణ సేవలు, వీధి బాలల సంక్షేమశాఖ జిల్లా పర్యవేక్షణాధికారి ఫారూక్‌బాషా సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంరక్షణ అవసరమైన పిల్లలు, చట్టంతో విభేదించిన పిల్లలు పూర్తిగా, పాక్షికంగా ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు పొందే సంస్థలు, తదితర బాల సంరక్షణ కేంద్రాలన్నీ జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. వివరాలకు https://wdcw.ap. gov. in/వెబ్‌సైట్ పరిశీలించాలని సూచించారు. నిబంధనలు పాటించని సంస్థల నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment