వివరాలు లేకుండానే బదిలీలా? | - | Sakshi
Sakshi News home page

వివరాలు లేకుండానే బదిలీలా?

Published Sat, Nov 2 2024 1:53 AM | Last Updated on Sat, Nov 2 2024 1:53 AM

వివరా

వివరాలు లేకుండానే బదిలీలా?

అనంతపురం ఎడ్యుకేషన్‌: తొలిసారిగా మునిసిపల్‌ టీచర్ల పదోన్నతుల ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. ఆ టీచర్ల వివరాలు లేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వమేమో ‘తాంబూలాలిచ్చాం తన్నుకుచావండి’ అన్న చందంగా మునిసిపల్‌ స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్‌, హెచ్‌ఎం ప్రమోషన్లు విద్యాశాఖ చేపట్టాలంటూ షెడ్యూలు విడుదల చేసింది. ఈ క్రమంలో ఈ నెల 6న హెచ్‌ఎం పదోన్నతులు, 8న స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులకు కౌన్సెలింగ్‌ చేపట్టాల్సి ఉంది. అనంతపురం మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఒక యూనిట్‌గా, ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రి, రాయదుర్గం, గుంతకల్లు, కదిరి, ధర్మవరం, హిందూపురం మునిసిపాలిటీలు ఒక యూనిట్‌గా పదోన్నతుల ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే ముందుగా సీనియార్టీ జాబితా తయారు చేయాల్సి ఉంది. విద్యాశాఖ అధికారుల వద్ద ఎలాంటి రికార్డులూ లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మునిసిపల్‌ ఆర్డీకి లేఖ రాశారు. అక్కడి నుంచి ఇప్పటిదాకా సరైన వివరాలు రాలేదు.

పాత జాబితాతో మమ

షెడ్యూలు ప్రకారం గత నెల 28న తాత్కాలిక సీనియార్టీ జాబితాను ప్రదర్శించాల్సి ఉంది. విద్యాశాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేక జాబితా తయారు చేయలేదు. గడువు ముంచుకురావడంతో మునిసిపల్‌ ఆర్డీ కార్యాలయానికి పరుగున వెళ్లి అందుబాటులో ఉన్న సీనియార్టీ జాబితా తీసుకొచ్చారు. దీన్నే తాత్కాలిక జాబితా అంటూ ప్రదర్శించారు. ఈ జాబితా మొత్తం తప్పులతడకగా ఉందంటూ టీచర్లు గగ్గోలు పెడుతున్నారు.

జాబితాలో రిటైర్డ్‌ టీచర్లు, బదిలీ టీచర్లు

అనంతపురంలోని పొట్టి శ్రీరాములు నగరపాలక ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వెంకటేశులు, రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాల హెచ్‌ఎం బండి పద్మావతి, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఇంగ్లిష్‌) రమేష్‌బాబు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పి.అజయ్‌కుమార్‌, ఎస్జీటీలు సీఎం సత్యనారాయణ, దేవరత్నమ్మ వీరంతా రిటైర్డ్‌ అయ్యారు. కానీ సీనియార్టీ జాబితాలో వీరిపేర్లు ఉన్నాయి. అలాగే గుంతకల్లు మునిసిపాలిటీ సరోజిని స్కూల్‌లో బయలాజికల్‌ సైన్స్‌ టీచర్‌గా పని చేస్తున్న పీఎస్‌ రాధ కర్నూలు జిల్లా ఆదోని మునిసిపల్‌ స్కూల్‌కు బదిలీ అయ్యారు. ఈమె పేరూ ఇందులో ఉంది. మునిసిపల్‌ ఆర్డీ అధికారులు కనీస కసరత్తు చేయకుండానే పాత జాబితానే పంపించి చేతులు దులుపుకొన్నారు.

ఖాళీలపై కసరత్తు

నగరపాలక సంస్థ స్కూళ్లు, మునిసిపల్‌ స్కూళ్ల హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ ఖాళీలపై కసరత్తు చేస్తున్నారు. అనంతపురంలో మూడు హెచ్‌ఎం పోస్టులు, రాయదుర్గంలో రెండు, గుంతకల్లులో ఒక పోస్టు ఉన్నట్లు గుర్తించారు. స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీల వివరాలను తెప్పించుకుంటున్నారు.

తెప్పించుకుంటున్నాం

మునిసిపల్‌ టీచర్లకు సంబంధించిన వివరాలు ఏవీ మావద్ద లేవు. షెడ్యూలు ప్రకారం పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలనే ఉద్దేశంతో మునిసిపల్‌ ఆర్డీ నుంచి తెప్పించుకున్న తాత్కాలిక సీనియార్టీ జాబితాను ప్రదర్శించాం. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నాం. డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓల నుంచి వివరాలు తెప్పించుకుంటున్నాం. క్షుణ్ణంగా అధ్యయనం చేసి అర్హుల జాబితాను ప్రకటించి పదోన్నతులు చేపడతాం.

– ప్రసాద్‌బాబు, డీఈఓ

తప్పుల తడకగా సీనియార్టీ జాబితా

బదిలీ, రిటైర్డ్‌ టీచర్ల పేర్లు జాబితాలో

తలలు పట్టుకుంటున్న విద్యాశాఖ అధికారులు

టీచర్ల వివరాల కోసం మునిసిపల్‌ ఆర్డీకి లేఖ

అనంతపురం కార్పొరేషన్‌ ఒక యూనిట్‌గా, ఉమ్మడి జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలు ఒక యూనిట్‌గా పదోన్నతులు

6న హెచ్‌ఎంలు, 8న స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల కౌన్సెలింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
వివరాలు లేకుండానే బదిలీలా? 1
1/1

వివరాలు లేకుండానే బదిలీలా?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement