‘ఉపాధి’ పనులు పకడ్బందీగా చేపట్టండి
వజ్రకరూరు/ ఉరవకొండ: ఉపాధి హామీ పథకం పనులను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం వజ్రకరూరు, ఉరవకొండ మండలాల్లో సూడిగాలి పర్యటన చేశారు. వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పరిసరప్రాంతంలో కొండపై ఉపాధి హామీ కింద చేపట్టిన ఖండిత కందకాలు పనులను పరిశీలించారు. అటు నుంచి గ్రామంలో ఆనంద్ అనే వ్యక్తి ఇంటి వద్ద రూ.2.30 లక్షలతో చేపడుతున్న వ్యక్తిగత పశువులపాక నిర్మాణ పనులను పరిశీలించి, లబ్ధిదారుతో మాట్లాడారు. అనంతరం రాగులపాడుంలో ఉపాధిహామీ కింద మట్టి రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. కొలతల ప్రకారం ఖండిత కందకాలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వీటిపై వచ్చే సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని డ్వామా పీడీ సలీంబాషాను ఆదేశించారు. వజ్రకరూరులో ఇంటింటికీ వెళ్లి సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి పింఛన్ల పంపిణీ తీరును ఆన్‌లైన్‌ద్వారా పర్యవేక్షించారు. తర్వాత ఉపాధి హామీ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడారు. అటు నుంచి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధి హామీ కింద ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. తన పర్యటనలో మండల స్పెషలాఫీసర్ ఆదిశేషానాయుడు కన్పించకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఎందుకు గైర్హాజరయ్యారో తెలుసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉరవకొండ ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం –దీపం–2ను కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా అంతటా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేపట్టారు. పథకం అమలులో ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబరు 1967కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అనంతరం ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్వామా ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూషనల్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులతో కలెక్టర్ ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment