సాయిబాబా ఆలయంలో పట్టపగలే చోరీ
● పంచలోహ విగ్రహం, వెండి సామగ్రి అపహరణ
ఉరవకొండ: స్ధానిక శిరిడి సాయిబాబా ఆలయంలో పట్టపగలే చోరీ జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలు... ఈ నెల 19న మాలాధారణ భక్తుడిగా ఆలయానికి వెళ్లిన ఓ దుండగుడు సాయిబాబా పంచలోహ విగ్రహంతో పాటు పెద్ద ఎత్తున వెండి సామగ్రి అపహరించుకెళ్లాడు. ఆ సమయంలో ఆలయంలో ఎవరూ లేకపోవడం గమనార్హం. మూలవిరాట్ వద్ద ఉంచిన బాబా పంచలోహ విగ్రహం, వెండి సామగ్రి, గంటను ఒక బ్యాగ్‌లో పెట్టుకోని తీసుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. బుధవారం దుయం ఆలయంలో విలువైన వెండి సామగ్రితో పాటు స్వామి పంచలోహ విగ్రహం లేకపోవడంతో సీసీ కెమెరా ఫుటేజీలను ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించారు. దీంతో చోరీ విషయం వెలుగు చూసింది. ఘటనపై పోలీసులకు ఆలయ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు.
ఆసియా దేశాల సదస్సుకు అనంత మేయర్
అనంతపురం ఎడ్యుకేషన్: ఇరాన్‌లో గురు, శుక్రవారాల్లో జరగనున్న ఆసియా దేశాల మేయర్ల సదస్సులో పాల్గొనేందుకు అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం వెళ్లారు. బుధవారం ఇరాన్ దేశం రాజధాని తెహరాన్‌కు చేరుకున్న ఆయనకు అక్కడి మునిసిపల్ అధికారులు ఘన స్వాగతం పలికారు. గురు, శుక్రవారం రెండురోజుల పాటు ఆసియన్ మేయర్స్ ఫోరం (ఏఎంఎఫ్) ఆధ్వర్యంలో ఖోర్రామాబాద్‌లో జరిగే సదస్సులో ఆయన పాల్గొననున్నారు. నగరాల్లో పౌరుల మధ్య మంచి సంబంధాలు పెంచడం, మెరుగైన జీవనం కల్పించడం, ఆయా దేశాల మధ్య దౌత్యం, పరస్పర విజ్ఞాన మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానంతో ఆయా నగరాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై మేయర్లు తమ అనుభవాలను వివరించనున్నారు. ప్రధానంగా పర్యావరణం, పట్టణ ఆరోగ్యంపై చర్చించనున్నారు. మేయర్ వసీం మాట్లాడుతూ...ఇతర దేశాలు మన నగరాన్ని గుర్తించడం గర్వకారణం అన్నారు. ఇది అనంతపురం నగర ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు.
నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు
లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయలో 9, 11వ తరగతి లెటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 26వ తేదీ వరకూ గడువు పొడిగించారు. ఈ మేరకు లేపాక్షిలోని విద్యాలయ ప్రిన్సిపాల్ నాగరాజు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉచిత ప్రవేశ పరీక్ష 2025, ఫిబ్రవరి 8న ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హులైన ఉమ్మడి జిల్లా విద్యార్థులకు నాగరాజు పిలుపునిచ్చారు.
ఇంటి పన్ను వివరాలు వారం లోపు అప్‌లోడ్ చేయాలి
అనంతపురం రూరల్: ఇంటి పన్ను వివరాలను వారం లోపు అప్‌లోడ్ చేయాలని పంచాయతీ అధికారులను డీపీఓ నాగరాజునాయుడు ఆదేశించారు. ఇంటి పన్ను అంశంపై బుధవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో డీఎల్‌డీఓలు, ఈఓఆర్డీలతో ఆయన సమీక్షించారు. పంచాయతీ కార్యదర్శులు ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసుకుని ఇంటి పన్ను వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పంట నమోదు తప్పనిసరి
బుక్కరాయసముద్రం: సాగు చేసిన పంటలను తప్పనిసరిగా ఈ–క్రాప్ నమోదు చేయించాలని రైతులకు జేడీఏ ఉమామహేశ్వరమ్మ పిలుపునిచ్చారు. బీకేఎస్‌లోని గాంధీనగర్ రైతు సేవాకేంద్రంలో బుధవారం నిర్వహించిన కౌలు రైతుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గుర్తింపు కార్డు ఉన్న ప్రతి కౌలు రైతుకూ బ్యాంక్‌ల ద్వారా పంట రుణాలు మంజూరు చేస్తామన్నారు. తీసుకున్న రుణాన్ని పంట కాలం అయిన తర్వాత బ్యాంకులకు చెల్లించాలన్నారు. ఈ–క్రాప్‌లో నమోదైన పంటలకు మాత్రమే నష్టపరిహారం, బీమా తదితర పథకాలు వర్తిస్తాయన్నారు. ఎల్‌డీఎం నరసింహారావు మాట్లాడుతూ ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన పథకం లబ్ధిని వివరించారు. కార్యక్రమంలో రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి, రెడ్డిపల్లి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి, ఎస్‌బీఐ మేనేజర్ శరత్, మండల ఏఓ శ్యామసుందరరెడ్డి, ఏఈఓ జ్ఞానజ్యోతి, నగేష్, వీఏఓలు, వీహెచ్‌ఓలు, ఎంపీఈఓలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment