అనంతపురం: నగరంలోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న చోరీ ఘటనలో నేరం రుజువు కావడంతో ముద్దాయికి 10 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ ఏడాది మే 18న తన ఇంటికి చాకలి నారాయణ తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి పొరుగు ఇంట్లో నిద్రపోయాడు. విషయాన్ని గుర్తించిన గుంతకల్లుకు చెందిన నల్లబోతుల వాసు తాళం వేసిన ఇంట్లోకి చొరబడి ఒక జత బంగారు కమ్మలు, మూడు జతల వెండి కాళ్ల పట్టీలు, ఒక శ్యామ్‌సంగ్ టీవీ, చిన్న పిల్లల దుస్తులు, రూ.68 వేలు విలువ చేసే పరికరాలు చోరీ చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసు వాదనలు పూర్తయి తుది తీర్పు బుధవారం వెలువడింది. నేరం రుజువు కావడంతో ముద్దాయి నల్లబోతుల వాసుకు పది నెలల జైలు శిక్ష విధిస్తూ మొబైల్ కోర్టు న్యాయమూర్తి జె.సుజిన్ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలను ఏపీపీ వి.శ్రీనివాసులు వినిపించారు.
మహిళను బెదిరించిన కేసులో ఏడాది జైలు
అనంతపురం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఓ మహిళను, ఆమె నాన్నను దుర్భాషలాడిన ఘటనలో నేరం రుజువు కావడంతో ముద్దాయికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒకటో స్పెషల్ కోర్టు జడ్జి కె.శివశంకర్ బుధవారం తీర్పు వెలువరించారు. నగరంలోని రంగస్వామి నగర్‌లో నివాసముంటున్న రమేష్ అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళపై అనుచితంగా ప్రవర్తించినట్లుగా నేరం రుజువైంది. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ ఎలమాసు భాను వాదనలు వినిపించారు.
ఆర్‌ఆర్‌బీ పరీక్షార్థుల కోసం ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ఈ నెల 23, 24వ తేదీల్లో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాసే అభ్యర్థుల రాకపోకలకు అనుకూలంగా అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు డివిజన్ కార్యాలయ వర్గాలు బుధవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించాయి. 23న నాంథేడ్ జంక్షన్ నుంచి మధ్యాహ్నం 12.25 గంటలకు బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు(07105) మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు తిరుపతికి చేరుతుంది. తిరిగి ఈ రైలు తిరుపతి జంక్షన్ నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 3.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నాంథేడ్ జంక్షన్‌కు చేరుతుంది. ఈ రైళ్లు ముద్కైడ్, ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, డోన్, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పీలేరు, పాకాల జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment