తండ్రీ కొడుకును కబళించిన విద్యుత్ తీగ
యల్లనూరు: పుట్లూరు మండలానికి చెందిన తండ్రీకొడుకును విద్యుత్ తీగ కబళించింది. వేరే ఊరికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగొస్తుండగా మార్గమధ్యంలో విద్యుత్‌తీగ తెగిపడడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. పుట్లూరు మండలం మడుగుపల్లికి చెందిన బయ్యన్న స్వామి పూజారి రామాంజినేయులు(42), కుమారుడు రవి (12) బుధవారం వైఎస్సార్ జిల్లా లింగాల మండలం అంకేవారిపల్లిలో బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్లారు. బంధువులందరితో మాట్లాడి తిరుగు ప్రయాణమయ్యారు. సింహాద్రిపురం మండలం బిదనంచెర్ల నుంచి యల్లనూరు మండలం దంతపల్లి మీదుగా వ్యవసాయ పొలాల రోడ్డులో వెళుతుండగా..మార్గమధ్యంలో విద్యుత్ తీగ తెగి ద్విచక్ర వాహనంపై పడింది. విద్యుత్ షాక్‌కు గురై తండ్రీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమీపంలోని రైతులు గమనించి విద్యుత్ అధికారులకు తెలియజేశారు. వారు కరెంట్ సరఫరా ఆపేశారు. విషయం తెలుసుకున్న రామాంజినేయులు భార్య భాగ్యలక్ష్మి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. ‘చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండాయా నాయనా.. పొద్దున్నే లేవగానే స్కూల్‌కు వెళ్లి ఉంటే ప్రమాదం తప్పేది కదరా’ అంటూ కుమారుడి మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. కాగా.. రామాంజినేయులుకు భార్య, ఇద్దరు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రమాదంలో మృతిచెందిన ఒక్కగానొక్క కుమారుడు రవి మడుగుపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తండ్రీ కొడుకు మృతితో మడుగుపల్లి శోకసంద్రమైంది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీరాంప్రసాద్, ఏఎస్‌ఐ సంపత్‌కుమార్, విద్యుత్ శాఖ డీఈ రాజశేఖర్, ఏఈ పద్మనాభరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొత్త లైన్ ఏర్పాటు చేశామని, ఈ లైన్ తెగి పడిందని విద్యుత్ సిబ్బంది చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment