ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు వీడాలి
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం, మరింత ఒత్తిడికి గురిచేసే విధానాలను ఇప్పటికై నా మానుకోవాలని కూటమి సర్కార్‌ను ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు శవన్నగారి బాలాజీ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని ఆపస్ కార్యాలయంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యవర్గాల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బాలాజీ మాట్లాడుతూ... ఇప్పటికే రకరకాల యాప్‌లు, ఎఫ్‌ఎల్‌ఎన్ మరియు లీడర్‌షిప్ ట్రైనింగ్‌లు, అపార్ నంబర్ జనరేషన్ తదితర బోధనేతర పనులతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. 117 జీఓతో ఉపాధ్యాయులపై విపరీతమైన పనిభారం ఉందన్నారు. దీనికి అదనంగా సాయంత్రం 5 గంటల వరకు బడి వేళలు పొడిగించడం దారుణమన్నారు. ప్రస్తుతం ఉన్న బడివేళలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉన్నాయన్నారు. అదే సమయాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆపస్ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలన్నారు. అప్పటిదాకా మధ్యంతర భృతి (ఐఆర్)ను ప్రకటించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి మాట్లాడుతూ... 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు జీఓ 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు పొందిన అధ్యాపకుడు డాక్టర్ రంగనాథంను సన్మానించారు. సమావేశంలో సంఘం గౌరవ సలహాదారుడు వెంకటేశ్వర ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణస్వామి, శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు, నాయకులు హర్షవర్ధన్, పీఎస్‌వీ నాయుడు, గోపీచంద్, భాస్కరయ్య, రమేష్ వెంకటేష్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment