తెలుగుదేశం నేత బరితెగింపు
అనంతపురం రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు బరితెగించారు. ప్రభుత్వ భూములే కాకుండా సామాన్యులు కష్టపడి కొనుకున్న స్థలాలను సైతం ఆక్రమించుకోవడానికి పన్నాగం పన్నారు. బుధవారం రుద్రంపేటలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఏళ్ల నాటి క్రితం కొనుగోలు చేసిన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు హిందూపురం మాజీ కార్పొరేటర్ చక్రపాణినాయుడు తమపై దౌర్జన్యం చేస్తున్నారని బి.యాలేరు గ్రామానికి చెందిన మనేరు ఈశ్వరయ్య కుటుంబసభ్యులు బుధవారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు మాట్లాడుతూ... కక్కలపల్లి సర్వే నంబర్ 133–1, 134లో 4 సెంట్ల స్థలాన్ని 1991లో కొనుగోలు చేసి తమ తల్లి మనేరు నరసమ్మ పేరిట రిజిష్ట్రేషన్ చేయించి, చుట్టూ ఫెన్సింగ్ వేయించామన్నారు. ఆ స్థలాన్ని తాము ఎవరికి విక్రయించలేదన్నారు. ఆ స్థలానికి చక్రపాణినాయుడుకు ఎలాంటి సంబందం లేకపోయినా ఆక్రమించుకునేందుకు తమపై దౌర్జన్యానికి తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థలాన్ని ఆక్రమించుకుంటే దిక్కేవరు వస్తారని, తనకు పరిటాల శ్రీరామ్, బాలకృష్ణ బందువులవుతారంటూ స్థలం చుట్టూ నాటిన బండలను జేసీబీతో పగులకొట్టించారని వాపోయారు. ఆ సమయంలో అడ్డుకోబోయిన మహిళలపై తన అనుచరులతో కలసి దురుసుగా ప్రవర్తించారన్నారు. పోలీసు అధికారులు స్పందించి టీడీపీ నాయకుల అరాచకాల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు.
టీడీపీ నాయకుల నుంచి రక్షణ కల్పించండి
తాతల కాలం నుంచి సాగులో ఉన్న భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు టీడీపీ నాయకులు కక్ష కట్టి తమపై దౌర్జన్యాలకు తెగబడుతున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలంటూ గార్లదిన్నె మండలం అంకంపేట గ్రామ రైతు గోపాలరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం అనంతపురంలోని ప్రెస్ క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంకంపేటలోని సర్వే నంబర్ 3–3లో తనకు 1.09 ఎకరాల భూమి ఉందన్నారు. నలభై ఏళ్లుగా తమ పూర్వీకుల నుంచి తాము సాగులో ఉన్నామన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు తమ పేరుపైనే ఉన్నా... కొన్ని నెలలుగా ఆ భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment