ప్రభుత్వ కార్యాలయాల తనిఖీ
బెళుగుప్ప: స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పీహెచ్‌సీని బుధవారం కళ్యాణదుర్గం ఆర్‌డీఓ వసంతబాబుతో కలసి జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో ఆర్‌ఐ విధుల్లో లేకపోవడం గమనించి తహసీల్దార్ షర్మిళను ప్రశ్నించారు. విధులకు సక్రమంగా హాజరు కాని వారిపై తనకు నివేదిక అందజేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీలో ఓపీ వివరాలపై వైద్యాధికారి ప్రియాంకతో ఆరాతీసారు. నూతనంగా నిర్మించిన భవనాన్ని పరిశీలించారు. అనంతరం రమనేపల్లి వద్ద పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అనుమతుల జారీ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
వ్యక్తి ఆత్మహత్య
గుమ్మఘట్ట: మండలంలోని 75 వీరాపురం గ్రామ నివాసి ప్రహ్లాద (38) ఆత్మహత్య చేసుకున్నాడు. 15 ఏళ్ల క్రితమైన ప్రహ్లాదకు భార్య తిప్పమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ నాలుగేళ్ల క్రితం తిప్పమ్మ మృతి చెందింది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం పద్మక్కను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబంలో తరచూ గొడవలు చోటు చేసుకుంటుండడంతో తాగుడుకు బానిసైన ప్రహ్లాద గ్రామ శివారులోని గుడిసెలో బుధవారం మద్యం మత్తులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
అనంతపురం: నగరంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని వన్‌టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. జిల్లాలో గంజాయి విక్రయాలపై ఈ నెల 18న గం‘జాయ్’ శీర్షికన ‘సాక్షి’ వెలువడిన కథనంపై ఎస్పీ జగదీష్ స్పందించారు. గంజాయి విక్రయాలు అరికట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విస్తృత తనిఖీలు చేపట్టిన అనంతపురం వన్‌టౌన్ పోలీసులు చెరువు కట్టపై అనుమానాస్పదంగా తచ్చాడుతున్న దూదేకుల షంషాద్‌వలి అలియాస్ షెక్షావలి అలియాస్ షెక్షా, షేక్ అబ్దుల్ ఖాదర్ జిలాన్ అలియాస్ జిలాన్‌తో పాటు మైనర్ బాలుడుని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో వారి వద్ద రెండు కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.
రైలు నుంచి జారి పడి
వ్యక్తి మృతి
గుత్తి: రైలు నుంచి జారి పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గుత్తి ఆర్‌ఎస్‌లోని పత్తికొండ మార్గంలోని ఆర్‌ఓబీ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలాన్ని జీఆర్‌పీ ఎస్‌ఐ నాగప్ప, కానిస్టేబుల్ వాసు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీఆర్‌పీ ఎస్‌ఐ నాగప్ప మాట్లాడుతూ... మృతుని వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఇతర ఆధారాలేమీ లభ్యం కాలేదని, ఆచూకీ పసిగట్టిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment