గంజాయి రవాణాను అరికట్టాలి
● ఎస్పీ జగదీష్
అనంతపురం: గంజాయి సరఫరా, రవాణా, క్రయ, విక్రయాలను అరికట్టాలని ఎస్పీ పి. జగదీష్ అన్నారు. పోలీసు కాన్ఫరెన్స్ హాలులో బుధవారం జిల్లాలోని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ముందుగా సర్కిళ్ల వారీగా ఎస్పీ కేసుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణా తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలించాలన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.రాంగ్‌రూట్‌లో వెళ్లే వాహనాలు, ఓవర్‌లోడ్, ట్రిపుల్‌రైడ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపేవారు, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానా విధించాలన్నారు. ప్రజలతో మమేకమై స్నేహపూర్వకంగా, సహాయకారిగా మెలిగినప్పుడే పోలీసుల పట్ల సదభిప్రాయం ఏర్పడి విశ్వాసం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి, డీఎస్పీలు వి. శ్రీనివాస రావు, వెంకటేశ్వర్లు, రవిబాబు, రామకృష్ణుడు, మహబూబ్ బాషా, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా మునిసిపల్ హెచ్‌ఎం పదోన్నతులు
అనంతపురం ఎడ్యుకేషన్: నగరపాలక సంస్థ, మునిసిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ బుధవారం ప్రశాంతంగా జరిగింది. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో మూడు గ్రేడ్–2 హెచ్‌ఎం పోస్టులకు, ఉమ్మడి జిల్లాలో మునిసిపాలిటీ స్కూళ్లలోని మూడు గ్రేడ్–హెచ్‌ఎం పోస్టులకు పదోన్నతులు జరిగాయి. డీఈఓ కార్యాలయంలో ఉదయం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి మధ్యాహ్నం కౌన్సెలింగ్ ద్వారా ఆయా పోస్టులను భర్తీ చేశారు. 1:3 చొప్పున కౌన్సెలింగ్‌కు పిలవగా.. అనంతపురం కార్పొరేషన్‌లో మొదటి అభ్యర్థి నాట్ విల్లింగ్ ఇచ్చారు. తక్కిన ముగ్గురూ పదోన్నతులు తీసుకున్నారు. మునిసిపాలిటీలకు వచ్చేసరికి మూడు పోస్టులకు 9 మంది అభ్యర్థులను పిలవగా ఇద్దరు విల్లింగ్ ఇచ్చి..తక్కిన ఏడుమంది నాట్ విల్లింగ్ ఇచ్చారు. దీంతో సీనియార్టీ జాబితాలో 13వ స్థానంలో ఉన్న టీచరు ఫోన్ ద్వారా విల్లింగ్ ఇవ్వడంతో ఆయనను గురువారం కార్యాలయానికి రావాలని సమాచారం ఇచ్చారు.
మలేరియా సబ్ యూనిట్ అధికారి సరెండర్
అనంతపురం మెడికల్: ఆరోగ్యశాఖలో ఉరవకొండ మలేరియా సబ్ యూనిట్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న కోదండరామిరెడ్డిని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ బుధవారం కడప ఆర్‌డీకి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ యూనియన్ పేరుతో కొంత మందిని బెదిరిస్తున్నట్లు అతనిపై ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
సాగునీటి సంఘాల
ఎన్నికలకు కసరత్తు
అనంతపురం సెంట్రల్: సాగునీటి సంఘాల ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. బుధవారం జిల్లా పరిషత్ డీఆర్‌సీ భవన్‌లో నీటి సంఘాల ఎన్నికలపై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ కేశవనాయుడు, హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్, చిన్ననీటి పారుదలశాఖ ఎస్‌ఈ విశ్వనాథ రెడ్డి, ట్రైనర్స్ రాజ్‌కుమార్, ఈఈ రమణారెడ్డిలు హాజరై ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. ఓటర్లుగా ఉన్న ఆయకట్టు రైతుల వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. పోలింగ్ రోజే చైర్మన్ ఎన్నిక ఉంటుందన్నారు. ఉదయం నామినేషన్ ప్రక్రియ, ఉప సంహరణ, ఫలితాల వెల్లడి జరుగుతుందని వివరించారు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదలవుతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment