పింఛన్‌దారులపై ‘పచ్చ’ కుట్ర
రాప్తాడు: ‘ఇది మంచి ప్రభుత్వం’ అంటూ ఇంటింటికీ తిరుగుతున్న టీడీపీ నాయకులు పింఛన్ దారులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. పింఛన్ అందకుండా చేసి వేధింపులకు పాల్పడుతున్నారు. అనర్హులంటూ ఈ నెల 6వ తేదీ నుంచి మండల వ్యాప్తంగా దాదాపు 140 మంది వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు అధికారుల ద్వారా నోటీసులు పంపారు. వీరిలో ఒక్కరు కూడా టీడీపీ వారు లేకపోవడం గమనార్హం.
అధికారులపై ఒత్తిడి.. : రాప్తాడు మండల వ్యాప్తంగా దాదాపు 7 వేల మంది వివిధ రకాల పింఛన్లు అందుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగించాలని అధికారులపై పచ్చ పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. తాము చెప్పినట్లు చేయకుంటే బదిలీపై మరో ప్రాంతానికి వెళ్లాలని బెదిరిస్తున్నారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లు భరించలేక ఎంపీడీఓ బుల్లే విజయలక్ష్మి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
బాధితుల ఆవేదన.. : నోటీసులు అందుకున్న పింఛన్‌దారులు బుధవారం రాప్తాడులోని ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని తమ అర్హత పత్రాలను అధికారులకు చూపించారు. నోటీసులు అందించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పింఛన్లను నిలుపుదల చేస్తే హైకోర్టులో దావా వేస్తామని స్పష్టం చేశారు. పింఛన్‌దారులకు వైస్ ఎంపీపీ బోయ రామాంజినేయులు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జూటూరు శేఖర్ మద్దతు పలికారు. కేవలం వైఎస్సార్ సీపీ సానుభూతి పరులకే నోటీసులు పంపడం అన్యాయమని, వైఎస్సార్ సీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క పింఛను కూడా తొలగించలేదని పేర్కొన్నారు. అర్హుల పింఛన్లు తొలగిస్తే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఈ విషయంపై ఎంపీడీఓ బుల్లే విజయలక్ష్మి మాట్లాడుతూ విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment