కొత్త వీసీ వచ్చే వరకే రెక్టార్, రిజిస్ట్రార్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ బాబు నూతన వీసీ వచ్చే వరకు మాత్రమే పదవుల్లో కొనసాగుతారు. కొత్త వీసీ తన అభీష్టం మేరకు వారిని పదవుల్లో కొనసాగించవచ్చు లేదా తొలగించవచ్చు. ఈ మేరకు ఎస్కేయూ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పాలకమండలి సమావేశం బుధవారం నిర్వహించారు. ఇందులో ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ పలు అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. స్టాటిస్టికల్ ఆఫీసర్ అయిన రమేష్ బాబు రిజిస్ట్రార్ పదవికి అనర్హుడని ఇటీవల పలువురు ప్రొఫెసర్లు మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ హోదా గల వ్యక్తిని రిజిస్ట్రార్‌గా నియామకం చేయవచ్చనే నిబంధన ఉన్నప్పటికీ, ఎలాంటి అర్హత లేని వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే జరిగిన పాలకమండలి సమావేశంలో రిజిస్ట్రార్ పదవిని ర్యాటిఫై చేసే అంశాన్ని ప్రవేశపెట్టగా కోన శశిధర్ సమ్మతించలేదు. పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రస్తుత రిజిస్ట్రార్, రెక్టార్ పదవులకు ఆమోదం తెలపలేమని స్పష్టం చేశారు. కొత్త వీసీ వచ్చే వరకు మాత్రమే కొనసాగాలని సూచించారు.
● 21 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లలో జువాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. శ్రీకాంత్ గతంలో వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే అప్పటి వీసీ మాచిరెడ్డి రామకృష్ణా రెడ్డి ఆమోదం తెలపడంపై ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించారు. ఒక ఉద్యోగి రాజీనామా చేస్తే కనీసం పిలిచి మాట్లాడి పునరాలోచించుకోవాలని కోరకుండా ఏకపక్షంగా రాజీనామాను ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆమోదంతో ఆయన్ను తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని పాలకమండలి నిర్ణయించింది. ఈ అంశంపై చర్చ జరుగుతున్న సందర్భంగా పాలకమండలి సభ్యులుగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాసేపు సమావేశం నుంచి బయటకు వెళ్లాలని కోరారు. కాగా, తమ పదవులను ర్యాటిఫై చేసే సమయంలో రెక్టార్, రిజిస్ట్రార్ సమావేశంలో ఉండకూడదు. కానీ ఇద్దరూ మీటింగ్‌లో కూర్చుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.
నూతన వైస్ చాన్స్‌లర్ వచ్చాక అభీష్టం మేరకు నిర్ణయం
ఎస్కేయూ పాలకమండలి సమావేశంలో తీర్మానం
Comments
Please login to add a commentAdd a comment