రైతులతో బీమా ప్రీమియం కట్టించండి
అనంతపురం అగ్రికల్చర్: రైతులతో బీమా ప్రీమియం డిసెంబర్ 15 లోపు కట్టించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. బుధవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రస్తుత రబీకి సంబంధించి అమలులో ఉన్న ప్రధానమంత్రి ఫసల్‌బీమా, వాతావరణ ఆధారిత బీమా పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పంటల బీమా పథకాలు రైతులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రబీలో పప్పుశనగ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు ఫసల్‌బీమా, అలాగే వాతావరణ బీమా కింద టమాటకు వర్తింపజేశారని తెలిపారు. వ్యవసాయ పంటలకు 1.5 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం డిసెంబర్ 15 లోపు రైతులు చెల్లించాల్సి వుంద న్నారు. పప్పుశనగ ఎకరాకు రూ.450 ప్రకారం, వేరుశనగ ఎకరాకు రూ.480, జొన్నకు రూ.315, మొక్కజొన్న రూ.325, వరికి రూ.630, టమాట రూ.1,600 ప్రకారం రైతులు ప్రీమియం చెల్లించాలన్నారు. రుణాలు పొందుతున్న రైతులు బ్యాంకు ల్లోనూ, రుణాలు లేని రైతులు కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్‌సీ), సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేదా నేషనల్ క్రాప్‌ఇన్సూరెన్స్ పోర్టల్ (ఎన్‌సీఐపీ)లో తమ వాటా చెల్లించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇందుకు వ్యవసాయ, ఉద్యానశాఖతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. పంట కోత ప్రయోగాల ఫలితాలు, ఆటోమేటిక్ వెదర్ రిపోర్టు ఆధారంగా బీమా పరిహారం లెక్కించి రైతులకు పరిహారం ఇస్తారని తెలిపారు. సమావేశంలో డీఆర్‌వో మలోలా, జేడీఏ ఉమామహేశ్వరమ్మ,, సీపీవో అశోక్‌కుమార్, డీహెచ్‌వో నరసింహారావు, ఎల్‌డీఎం నర్సింగ్‌రావు, ఇన్సూరెన్స్ కంపెనీ, ఎన్‌ఐసీ అధికారులు, టెక్నికల్ ఏవోలు పాల్గొన్నారు.
‘పీఎం ఆవాస్’పై విస్తృత అవగాహన
గుత్తి రూరల్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. గుత్తి మండలంలోని జక్కలచెరువు గ్రామంలో బుధవారం జరిగిన ‘పీఎం ఆవాస్ యోజన, సప్తాహ్’ వారోత్సవాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకం అమలులో రాష్ట్రంలోనే జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు. గ్రామ స్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గృహానికి రూ.1.20 లక్షలు అందుతుందని వివరించారు. స్థలం ఉన్న వారికి పొజీషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తామని, స్థలం లేని వారు అర్జీ ఇస్తే మంజూరు చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రోడ్లు, ఇంకుడు గుంతలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడతామన్నారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి లక్ష్యాలను పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ శైలజను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించుకున్న ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలోని ఎస్టీ కాలనీలో నిర్వహించిన సికిల్ సెల్ వ్యాధి నిర్మూలన మిషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం అవుతోందని ఎంపీపీ విశాలాక్షి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో డీటీడబ్ల్యూఓ రామాంజనేయులు, తహసీల్దార్ ఓబిలేసు, ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, జిల్లా ఉపాధి కల్పనాధికారి కల్యాణి, సీహెచ్‌ఓలు నాగమణి, మోనాలిసా, ఏఎన్‌ఎం సుగుణ, హౌసింగ్ డీఈ మధుసూదన్‌రెడ్డి, ఏఈ సూర్యనారాయణ, సర్పంచ్ సుహాసిని, ఎంపీటీసీ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment