No Headline
ప్రశాంతి నిలయం: అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధామం ప్రశాంతి నిలయంలో విద్యాసౌరభాలు విరబూశాయి. సత్య మందిరంలో జ్ఞాన కాంతులు ప్రకాశించాయి. స్వర్ణపతకాలు దక్కిన వేళ ప్రతి విద్యార్థి మోములోనూ ఆనందం వెల్లివిరిసింది. బిడ్డల పట్టాభిషేకం చూసి తల్లిదండ్రులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఈ అద్భుత ఘట్టానికి పూర్ణచంద్ర ఆడిటోరియం వేదికై ంది. సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 43వ స్నాతకోత్సవం శుక్రవారం ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. వర్సిటీ చాన్సలర్ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన స్నాతకోత్సవానికి యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ సేతురామన్ పంచనాథన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో 463 మందికి పట్టాలు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 22 మందికి బంగారు పతకాలు, మరో 14 మందికి డాక్టరేట్లు ప్రదానం చేశారు.
‘ఐ ఓపెన్ కాన్వొకేషన్’
అని పలికిన సత్యసాయి..
సత్యసాయి జయంత్యుత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. తొలుత యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్, బోర్డు డైరెక్టర్ల బృందం పూర్ణ చంద్ర ఆడిటోరియానికి ర్యాలీగా చేరుకుంది. అనంతరం ఫౌండర్ చాన్సలర్ సత్యసాయిబాబా ‘ఐ ఓపెన్ కాన్వొకేషన్’ అంటూ డిజిటల్ స్కీన్ ద్వారా ప్రకటించారు. అనంతరం వేడుకలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాఘవేంద్ర ప్రసాద్ యూనివర్సిటీ వార్షిక నివేదికను వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ.. సత్యసాయి ఆశయాలకు అనుగుణంగా మానవతా విలువలు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కలగలిపి ఆధునిక గురుకుల విద్యావిధానం ద్వారా సత్యసాయి విద్యాసంస్థలలో ఆదర్శమైన విద్యను ఉచితంగా అందిస్తున్నామన్నారు. నేటి సమాజ అవసరాలకు అనుగుణంగా నూతన అవిష్కరణలు, పరిశోధనా రంగాల వైపు దృష్టి కేంద్రీకరించామన్నారు. 2020 జాతీయ విద్యా విధానం మేరకు కొత్తగా ఐదు కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. బీఈ మ్యాథమ్యాటిక్స్ అండ్ టెక్నాలజీ, డాటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోసైన్సెస్ అండ్ టెక్సాలజీ కోర్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే గేట్స్, సీఎస్‌ఐఆర్, యూజీసీ, నీట్ తదితర పరీక్షల్లో సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు సత్తాచాటుతున్నారన్నారు. అనంతరం చాన్సలర్ చక్రవర్తి అడ్మిషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్నాతకోత్సవ ప్రతిజ్ఞ చేయించారు.
డాక్టరేట్లు పొందిన వారు వీరే...
సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 43వ స్నాతకోత్సవంలో పరిశోధనా రంగంలో ప్రతిభ చాటిన పలువురికి చాన్సలర్ చక్రవర్తి, ముఖ్య అతిథి సేతురామన్ పంచనాథన్ డాక్టరేట్లు ప్రదానం చేశారు. డాక్టరేట్లు పొందిన వారిలో డెన్నీ జార్జి, రోషన్ రాయ్, వి.సాయిరామ్, హిరాక్ దూషీ, వి.భాస్కరన్, సీఆర్ సంతోష్, ద్వాలా లోకేశ్వరరావు, పోనపల్లి ప్రశాంతి ప్రభు, ఎంఎస్ సాయి వినోద్, ప్రజాల చేత్రి, పట్నాన దుర్గా ప్రసాద్, ఆకాంక్ష అగర్వాల్, సురేష్ కుమార్ దహాల్ ఉన్నారు.
నిబద్ధతే విజయానికి సోపానం..
నిబద్ధతే విజయానికి సోపానమని, విద్యార్థులంతా తాము ఎంచుకున్న రంగాల్లో క్రమశిక్షణతో ముందుకు సాగాలని యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ సేతురామన్ పంచనాథన్ పిలుపునిచ్చారు. సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 43వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి స్నాతకోత్సవ సందేశాన్నిచ్చారు. క్రమశిక్షణ, సేవానిరతి, మానవతా విలువలు కలగలిపి బోధించే సత్యసాయి విద్యాసంస్థల్లో చదువుకున్న వారంతా ఎంతో అదృష్టవంతులన్నారు. విద్యార్థులంతా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సమాజంలో నెలకొన్న సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. ప్రతి విద్యార్థీ సానుకూల దృక్పథంలో ముందుకు నడవాలన్నారు. ప్రతి అడుగూ సమాజహితం కోసం వేయాలని పిలుపునిచ్చారు.
అంబరం.. స్నాతక సంబరం
ఘనంగా సత్యసాయి డీమ్డ్
యూనివర్సిటీ 43వ స్నాతకోత్సవం
ముఖ్య అతిథిగా పాల్గొన్న
సేతురామన్ పంచనాథన్
సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు
463 మందికి పట్టాల అందజేత
22 మందికి బంగారు పతకాలు,
14 మందికి డాక్టరేట్లు ప్రదానం
ప్రతిభకు పట్టాభిషేకం..
స్నాతకోత్సవంలో భాగంగా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన 22వ మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. బంగారు పతకాలు పొందిన వారిలో దీశెట్టి సాయి నందన్, పోడూరు శేష సాయి, హెచ్ శ్రీరాం, కొప్పోలు మణికంఠ, ఆకాశ్ బైరాగి, సత్యనారాయణ నారాయణ, సాహిల్ ప్రధాన్, అగవేంటి భార్గవ్, జుట్టు ఆదర్శ వర్మ, మైనక్ ముఖర్జీ, కోళ్ల వినయ్ సాయి, విక్రమ్ కృష్ణ, రితు రాజ్ ప్రధాన్, మద్దూరి సాయి శ్రీ దత్తా, కుమారి యుక్తి భరద్వాజ్, నేతేటి కేశవాణి, గుగ్గిలం శ్రీచందన్ కృష్ణ, బెల్లపు రవ్వల శ్రేయ, చెరుకూరి సాయి కార్గిక్, శ్రీరామ్ కోరి, నితిన్ నిత్య హర్ష ఉన్నారు. వీరికి యూనివర్సిటీ చాన్సలర్ చక్రవర్తి, ముఖ్య అతిథి సేతురామన్ పంచనాథన్ పతకాలు ప్రదానం చేశారు. పరిశోధనా రంగంలో విశేష ప్రతిభ కనభరిచిన 14 మందికి డాక్టరేట్లు అందించారు. అలాగే మరో 436 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యులు నాగానంద, డాక్టర్ మోహన్, సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment