ఓటీ కోర్సు రద్దుకు కుట్ర
అనంతపురం ఎడ్యుకేషన్: నిరుపేద కుటుంబాల విద్యార్థులకు సత్వర ఉపాధికి భరోసానిస్తున్న ఇంటర్‌లో ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ (ఓటీ) ఒకేషనల్ కోర్సు రద్దుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేసింది. రాష్ట్రంలో ఒక్క అనంతపురంలోని కేఎస్‌ఆర్ బాలికల జూనియర్ కళాశాలలో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉండడం గమనార్హం. ఏటా 35 నుంచి 40 మంది విద్యార్థినులు అభ్యసిస్తున్న ఈ కోర్సులో అత్యధికులు పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉంటున్నారు. కోర్సు పూర్తికాగానే ఉపాధి లభిస్తుండడంతో మిగిలిన ఒకేషనల్ బ్రాంచ్‌లకంటే ఓటీకే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అలాంటి డిమాండ్ ఉన్న కోర్సులో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టరాదంటూ ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో ఈ కోర్సు రద్దు చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఇంటర్ బోర్డు కమిషనర్ కార్యాలయాధికారులు ఫోన్ ద్వారా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రిన్సిపాల్ నాగరత్నమ్మను వివరణ కోరగా...ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ కోర్స్ రద్దు చేయనున్నట్లు కమిషనర్ కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయన్నారు. ఈ కోర్సు వల్ల పేద వర్గాల ఆడపిల్లలకు మంచి ఉపయోగముందంటూ ‘సక్సెస్’ లేఖ రాసి పంపినట్లు తెలిపారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన..
కేఎస్‌ఆర్ బాలికల జూనియర్ కళాశాలలో అమలవుతున్న ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ కోర్స్‌ను కొనసాగించాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సప్తగిరి సర్కిల్ నుంచి బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్ మాట్లాడారు. ఓటీ కోర్సు చేసిన వెంటనే ఉపాధి లభిస్తోందన్నారు. ఇప్పటిదాకా ఈ కోర్స్ చేసిన వేలాదిమంది విద్యార్థినులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, ఆప్టికల్ క్లినిక్‌లో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. మరికొందరు ఉన్నత చదువులకు వెళ్తున్నారన్నారు. ఇలాంటి టెక్నికల్ కోర్స్‌ను మరింత అభివృద్ది చేయాల్సింది పోయి నిర్వీర్యం చేయాలని చూస్తుండడం సిగ్గు చేటన్నారు. కోర్సు రద్దు చేయకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ నాయకులు సోము, విజయ్, సాయి, ధనుష్, రాకేష్, కార్తీక్, విద్యార్థినులు హేమలత, దివ్యకళ, దీపిక, మమతా పాల్గొన్నారు.
సత్వర ఉపాధికి భరోసానిస్తున్న
ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ కోర్సు
రాష్ట్రంలో కేఎస్‌ఆర్ బాలికల
జూనియర్ కళాశాలలో మాత్రమే
కొన్నేళ్లుగా నిర్వహణ
వచ్చే విద్యా సంవత్సరం
అడ్మిషన్లు చేపట్టరాదంటూ
ప్రభుత్వ మౌఖిక ఆదేశాలు
కోర్సును కొనసాగించాలంటూ
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన
Comments
Please login to add a commentAdd a comment