లడ్డూ ప్రసాదమూ కరువే!
ఉరవకొండ: పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగాను, పర్యాటక కేంద్రంగాను ప్రసిద్ధిగాంచింది. ఇక్కడకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటుంటారు. అయితే భక్తులు లడ్డూ ప్రసాదానికి నోచుకోలేకపోతున్నారు. భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం అందించేందుకు దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులు ఇంత వరకు టెండర్లు పిలవలేదు. శని, ఆదివారాలతో పాటు పండుగ రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. శ్రీవారి భక్తులకు అందించే లడ్డూ తయారీ కోసం ఆలయ ప్రాంగణంలోనే ఒక గది కేటాయించారు. అక్కడ బ్రాహ్మణులు నియమ నిష్టలతో లడ్డూ తయారు చేయాలి. దేవదాయ అధికారులు సైతం పర్యవేక్షణ చేసి.. నాణ్యతను పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అనివార్య కారణాల వల్ల లడ్డూ ప్రసాదం తయారీ ఆగిపోయింది. ఆరు నెలలు అవుతున్నా తదుపరి లడ్డూ తయారీ ప్రక్రియకు సంబంధించి టెండర్లు పిలవకపోవడం పట్ల దేవదాయ శాఖ అధికారుల తీరుపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. భక్తుల రద్దీ సమయంలో లడ్డూ ప్రసాదం ఇవ్వకపోతే బాగుండదని కొందరు సిబ్బంది సహకారంతో బయటి దుకాణాల్లోంచి తీసుకొచ్చిన లడ్డూలను విక్రయించారు. అయితే లడ్డూ తయారీలో నాణ్యత లోపించిందని, అధిక ధర వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో అధికారులు బయటి లడ్డూలకూ మంగళం పాడేశారు. భక్తులు స్వామి దర్శనా నంతరం తీర్థంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
పెన్నహోబిలం ఆలయంలో ముందుకు సాగని టెండర్లు
త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం
ఆలయాల్లో భక్తులకు అందించే లడ్డూ ప్రసాదం తయారీ బాధ్యతలను దేవదాయ, ధర్మదాయ శాఖ బ్రాహ్మణులకు అప్పగించింది. ఇది వరకు లడ్డూ తయారు చేసి అందుబాటులో ఉంచేవాళ్లం. అనివార్య కారణాల వల్ల లడ్డూల తయారీ ఆగిపోయింది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం. బ్రాహ్మణుల ద్వారా లడ్డూ తయారీని పునరుద్ధరిస్తాం.
– సాకే రమేష్‌బాబు, ఈఓ, పెన్నహోబిలం
Comments
Please login to add a commentAdd a comment