రీ–సర్వేకు రైట్ రైట్
26న గ్రామ సభలు
భూముల రీ–సర్వేకు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 31 గ్రామాల్లో ఈ నెల 26న గ్రామ సభలు నిర్వహించనున్నాం. సర్వే ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లుతో సిద్ధంగా ఉన్నాం.
– రూప్లానాయక్, ఏడీ,
సర్వే భూ రికార్డుల శాఖ
అనంతపురం అర్బన్: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేకూర్చే దిశగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమగ్ర భూముల రీ–సర్వేకు చర్యలు చేపట్టింది. దీన్ని అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది. విమర్శలు గుప్పించి అవాస్తవాలతో కూడిన విషపు రాతలను ఎల్లో మీడియాలో రాయించింది. జనసేన–బీజేపీతో కలిసి టీడీపీ కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో కొలువుదీరిన తర్వాత యూటర్న్ తీసుకుంది. గత ప్రభుత్వ విధానాలనే అనుసరిస్తూ భూముల రీ–సర్వేకు సిద్ధమయ్యింది. సర్వే క్రమంలో తలెత్తే వివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా మండలానికి ఒక డిప్యూటీ తహసీల్దార్‌ను మొబైల్ మెజిస్ట్రేట్‌గా గత ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం వారు యథావిధిగా కొనసాగనున్నారు.
గతంలో పక్కాగా రీ–సర్వే..
జిల్లావ్యాప్తంగా మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 32 మండలాల్లో 503 గ్రామాలకు సంబంధించి 25,17,658.52 ఎకరాల భూముల రీ సర్వేకు గత ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. అన్ని గ్రామాల్లో డ్రోన్ ఫ్‌లై ద్వారా ఓఆర్‌ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) చిత్రాలను తీశారు. 499 గ్రామాలకు ఓఆర్‌ఐలు సిద్ధంగా ఉన్నాయి. అదే క్రమంలో 198 గ్రామాల పరిధిలోని 1,83,353 భూ కమతాలకు సంబంధించి 5,88,615.626 ఎకరాలు సర్వే చేసి హద్దు రాళ్లు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు రీ–సర్వే పూర్తయిన చోట్ల గ్రామ సభలను అధికారులు నిర్వహించారు. అయితే 1,83,353 భూ కమతాలకు గానూ 5,421 ఫిర్యాదులు (0.03 శాతం) మాత్రమే వచ్చాయి. దీన్నిబట్టి చూస్తే సర్వే ఎంత పక్కాగా జరిగిందనే విషయం సుస్పష్టం. మొత్తం ఫిర్యాదుల్లో సర్వేకు సంబంధించి 4,377 రాగా.... రెండు వేల ఫిర్యాదులు పరిష్కరించినట్లు అధికారులు చెప్పారు.
పైలట్ ప్రాజెక్టుగా 31 గ్రామాల్లో సర్వే షురూ..
జిల్లావ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒకటి చొప్పున 31 గ్రామాల్లో రీ–సర్వే చేసేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. ఈ 31 గ్రామాల్లో 1,26,618.760 ఎకరాలు సర్వే చేయాల్సి ఉంటుంది. ప్రతి గ్రామంలో 200 నుంచి 250 ఎకరాల వరకు ఒక బ్లాక్‌గా మొత్తం 31 గ్రామాల్లో 506 బ్లాక్‌లు ఏర్పాటు చేశారు. సర్వే చేసేందుకు ఒక్కో గ్రామానికి నాలుగు టీమ్‌లను నియమించారు. ఒక్కొక్క టీమ్‌లో ఇద్దరు గ్రామ సర్వేయర్లు, ఒక వీఆర్‌ఓ ఉంటారు. ఇక భూ వివాదాల పరిష్కారానికి గతంలో మాదిరిగానే మొబైల్ మెజిస్ట్రేట్‌గా డిప్యూటీ తహసీల్దారు వ్యవహరిస్తారు.
సర్వే ప్రక్రియలో మార్పు ఇదే..
భూముల రీ–సర్వే ప్రక్రియలో గత ప్రభుత్వ విధానాలనే ప్రస్తుతమూ కొనసాగిస్తున్నారు. ఇందులో మార్పుల విషయానికి వస్తే 13– నోటిఫికేషన్‌కు గతంలో 90 రోజులు, 6 లేయర్ పరిశీలనకు 45 రోజులు మొత్తం 135 రోజులు ఉండేది. ఆ వ్యవధిని ప్రస్తుతం 165 రోజులకు పెంచారు. నాడు వలంటీర్ల భాగస్వామ్యం ఉండేది. ప్రస్తుతం వారు లేకపోవడంతో 200 ఎకరాల నుంచి 250 ఎకరాలను ఒక బ్లాక్‌గా ఏర్పాటు చేశారు. ఇక హద్దురాళ్లపై ఉన్న భూ సురక్ష పథకం పేరు తుడిపేయడం. ఇవి మాత్రమే ప్రస్తుతం జరిగిన మార్పులు.
కూటమి సర్కార్ సైతం
గత ప్రభుత్వ బాటలోనే
నాడు విమర్శలు..
నేడు యూటర్న్ తీసుకున్న వైనం
పైలట్ ప్రాజెక్టుగా 31 గ్రామాల్లో
సర్వేకు సమాయత్తం
ఇదివరకటిలానే డిప్యూటీ తహసీల్దార్లే మొబైల్ మెజిస్ట్రేట్లు
Comments
Please login to add a commentAdd a comment