ముగ్గురిపై అట్రాసిటీ కేసు
● అర్ధరాత్రివేళ ఇంటిని ఐషర్‌తో ఢీ
● గోడ కూలి తీవ్రంగా గాయపడిన దంపతులు
గార్లదిన్నె: మండలంలోని ఇల్లూరుకు చెందిన శ్రీనివాసులు, రామాంజనేయులు, అల్లాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు గార్లదిన్నె పీఎస్ ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. ఈ నెల 20న అర్ధరాత్రి ఐచర్ వాహనంతో అదే గ్రామానికి చెందిన మణికంఠ ఇంటిని నిందితులు ఢీకొన్నారు. ఘటనలో ఇల్లు గోడ విరిగి పడడంతో లోపల నిద్రిస్తున్న దంపతులు మణికంఠ, స్వాతి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అప్రమత్తమై క్షతగాత్రులను అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఘటనపై ఆరా తీశారు. ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. అనంతరం నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కాగా, ఎస్సీ, ఎస్టీలపై దాడులు, హత్యాయత్నాలకు పాల్పడితే సహించేది లేదని ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సాకే గోవిందు పేర్కొన్నారు. మణికంఠ దంపతులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మణికంఠ దంపతులను ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు పరామర్శించారు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇల్లు కోల్పోయిన మణికంఠకు వెంటనే పునరావాసం కల్పించి, కొత్త ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment