ఐటీడీపీ కార్యకర్తలపై ఫిర్యాదు
బెళుగుప్ప: టీడీపీకి చెందిన సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు విడుదల రజిని, ఆర్‌కే రోజాపై అసభ్యకర పోస్టింగ్ చేసిన ఐటీడీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం బెళుగుప్ప పీఎస్ ఎస్‌ఐ శివను వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చిన్న మచ్ఛన్న, నక్కలపల్లి సర్పంచ్ రామిరెడ్డి, పార్టీ మండల నాయకులు పాతన్న, వెంకటేశులు, పూలప్రసాద్, బాబురెడ్డి, నరిగన్న, ఎర్రిస్వామి తదితరులు కలసి ఫిర్యాదు ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా మచ్ఛన్న మాట్లాడుతూ... సోషల్ మీడియాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పరువుకు భంగం కలిగేలా ఐటీడీపీ కార్యకర్తలు పోస్టింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. వీరి చర్యల కారణంగా రాష్ట్రంలో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ప్రశాంతతకు భంగం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అశ్లీల పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి
కళ్యాణదుర్గం రూరల్: ఐటీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్‌ఎం మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆర్‌కే రోజా, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, డైరెక్టర్ రామ్‌గోపాలవర్మల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా అశ్లీల పోస్టింగ్‌లు పెట్టారని మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదివారం కళ్యాణదుర్గం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అమిత్‌షా రాజీనామా చేయాలి
● రఘువీరా డిమాండ్
మడకశిర: అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు ఆక్షేపణీయమని, ఈ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని తెలిపారు. అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించారని గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్య యుగంలో అంబేడ్కర్ కచ్చితంగా దేవుడేనని తెలిపారు.
ప్రశాంతంగా
వదాన్య టాలెంట్ టెస్ట్
పుట్టపర్తి టౌన్: కొత్తచెరువులో ఆదివారం వదాన్య సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన వదాన్య టాలెంట్ టెస్ట్ –2024 ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 150 జెడ్పీ ఉన్నత పాఠశాల్లో 9,10 వతరగతి చదువుతున్న 3400 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ చేయగా 3150 మంది హాజరయ్యారు. మొత్తం ఏడు కేంద్రాల్లో పరీక్ష జరిగింది. డీఎస్పీ విజయకుమార్, సీఐ ఇందిర పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగానికి వదాన్య ఫౌండర్ అశోక్ పడపాటి కృతజ్ఞతలు తెలియజేశారు. జనవరి 10న ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment