పాత పనులు.. కొత్త బిల్లులు
బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్థానిక టీడీపీ నేతలు ఉపాధి పథకంలో అక్రమాలకు తెరలేపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో సీఎంఓకు ఓ టీడీపీ నేత చేసిన ఫిర్యాదు ప్రస్తుతం కలకలం రేపుతోంది. వివరాలు... బీకేఎస్ మండలంలోని సెంట్రల్ జైలు సమీపంలోని తాడిపత్రి రహదారి నుంచి జంతలూరులోని సెంట్రల్ యూనివర్సిటీ వరకూ రూ.4 కోట్లతో డబుల్ రోడ్డు వేశారు. ఆ సమయంలో రోడ్డుకు ఇరువైపులా జేసీబీతో మట్టి తీని తీయడంతో కాలువను తలపించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చూసేందుకు కాలువల కనిపిస్తున్న మార్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టీడీపీ సానుభూతిపరుడు నాగభూషణ అక్రమాలకు తెరలేపాడు. ఉపాధి పథకంలోని ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్ సహకారంతో రోడ్డు పక్కన కాలువ ఏర్పాటు పేరుతో వర్క్ ఐడీ 0212026004, ఐసీ జీఐఎస్ 1390777 కింద పనులు చేపట్టాడు. అప్పటికే జేసీబీతో తవ్విన మార్గంలో పెరిగిన పిచ్చి మొక్కలను 10 మంది ప్రైవేటు కూలీలతో తొలగించి బిల్లులు చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత పక్కా ఆధారాలతో సీఎంఓకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం చర్చానీయాంశమైంది. ఉపాధి సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవినీతి అక్రమాలకు పాల్పడిన ఉపాధి సిబ్బంది, ఫీల్ట్ అసిస్టెంట్‌ను తొలగించాలని టీడీపీ నాయకుడు గుత్తా వెంకటనాయుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అక్రమార్కులపై వేటు పడకుండా ఉన్నత అధికారులపై స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు తీసుకెళ్లినట్లు ఆరోపించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకునేంత వరకూ ఈ పోరాటం కొనసాగిస్తానంటూ సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment