శోకం నుంచి బయటపడేసే శక్తి కవిత్వానిది
అనంతపురం కల్చరల్: అంతులేని శోకం నుంచి సైతం వ్యక్తిని బయటపడేసి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించేలా చేసే శక్తి కవిత్వానికి ఉందని రాధేయ నిరూపించారంటూ ప్రముఖ కవి వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. ప్రతిష్టాత్మకంగా సాగే ఉమ్మడిశెట్టి సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం ఆదివారం అనంతపురంలోని ఎన్జీఓ హోమ్‌లో జరిగింది. ఈ ఏడాది ఉమ్మడిశెట్టి జాతీయ యువ పురస్కారాన్ని బెంగళూరుకు చెందిన మానస చాపర్తికి, 36వ ఉమ్మడిశెట్టి జాతీయ పురస్కారాన్ని విశాఖపట్నానికి చెందిన సత్యనారాయణకు అందజేశారు. అనంతరం రాధేయ రచించిన ‘అజేయుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అవార్డుకు ఎంపికై న డాక్టర్ బండి సత్యనారాయణ ఒంటికాలి పరుగు గ్రంథాన్ని డాక్టర్ పెళ్లూరు సునీల్, చాపర్తి మానస కవిత్వంపై డాక్టర్ సుంకర గోపాల్ సమీక్షించారు. సీనియర్ రచయిత్రి ప్రగతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి, కవి చినవీరభద్రుడు ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. భార్య, కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోయినా ఆ శోకాన్ని దిగమింగే శక్తి రాధేయకు కవిత్వం అందజేసిందన్నారు. కార్యక్రమంలో సీనియర్ కథా రచయిత డాక్టర్ శాంతినారాయణ, షరీఫ్, చంద్రశేఖరశాస్త్రి, మధురశ్రీ, రియాజుద్దీన్, రాజారాం, ప్రముఖ చిత్రకారులు ఆమ్రపాలి, చెట్ల ఈరన్న తదితరులు పాల్గొన్నారు.
కవి వాడ్రేవు చినవీరభద్రుడు
Comments
Please login to add a commentAdd a comment