ఉత్తమ రైతుగా గద్దె రమణారెడ్డి
రాప్తాడు: ద్రాక్ష సాగులో అత్యధిక దిగుబడి సాధించడమే కాక... తమ ప్రాంత రైతులకు అవగాహన కల్పించి, ద్రాక్ష సాగులో తోడ్పాటునందించిన రాప్తాడు మండలం హంపాపురం గ్రామానికి చెందిన రైతు గద్దె రమణారెడ్డిని ఉత్తమ రైతు పురస్కారంతో తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. వివరాలు... తనకున్న 5 ఎకరాల్లో రమణారెడ్డి గత ఏడాది దిల్‌ఖుష్ రకం ద్రాక్ష సాగు చేపట్టి గణనీయమైన దిగుబడిని సాధించాడు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ వ్యవసాయాధికారులు అప్పట్లో రమణారెడ్డి తోటను సందర్శించి, ద్రాక్ష సాగు విధానాలను తెలుసుకున్నారు. అనంతరం దిగుబడులు వచ్చినప్పుడు మరోసారి క్షేత్ర సందర్శనకు వచ్చారు. అంతకు ముందు రైతు చెప్పినట్లుగానే ఎకరాకు 20 నుంచి 40 టన్నుల దిగుబడి సాధించడం, ఎకరాకు రూ.10 లక్షల దాకా ఆదాయాన్ని గడించడం తెలుసుకున్న అధికారులు ప్రత్యేక నివేదిక సిద్ధం చేసి తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు. దీంతో తెలంగాణలోనూ ద్రాక్ష సాగును అక్కడి ప్రభుత్వం ప్రోత్సహించింది. రైతు సూచనలు, సలహాలు పాటిస్తూ అక్కడి రైతులు అధిక పంట దిగుబడులు సాధించారు. దీంతో ఆదివారం నల్గొండ జిల్లా యాదాద్రిలో జరిగిన సమగ్ర వ్యవసాయ విజ్ఞాన సదస్సులో పుడమి పుత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రమణారెడ్డి, ఆయన సతీమణి పార్వతి పుడమి పుత్ర, కిసాన్ సేవా రత్న అవార్డును అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment