మామిడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టండి
అనంతపురం అగ్రికల్చర్: వరుస తుఫాన్లు, మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడి తోటల్లో మేలైన యాజమాన్య పద్ధతులు, సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు ఉద్యానశాఖ డీడీ బీఎంవీ నరసింహారావు సూచించారు. ఆత్మకూరు, గార్లదిన్నె మండలాల్లో రైతుల మామిడి తోటలను హెచ్‌ఓ రత్నకుమార్‌తో కలసి గురువారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం మామిడి తోటలు పూమొగ్గ, పచ్చిపూత, పూత దశ లాంటి కీలకదశలో ఉన్నాయన్నారు. మంచి దిగుబడుల కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 10 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయన్నారు. తుఫాన్ల వల్ల చిరుజల్లులు, ఉష్ణోగ్రతలు తగ్గడం, మబ్బులు, ముసురు లాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రసంపీల్చు పురుగు ఉధృతి పెరిగే అవకాశముందన్నారు. పూమొగ్గ దశలో ఉన్న తోటల్లో తేనెమంచు పురుగు, పక్షికన్ను తెగులు, బూడిద తెగులు నివారణకు లీటర్ నీటికి 0.3 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ + 2 మి.లీ క్లోరోథలోనిల్ కలిపి పిచికారీ చేయాలన్నారు. పచ్చిపూత దశ ఉన్న తోటల్లో లీటర్ నీటికి 0.3 గ్రాములు థయామిథాక్సామ్ లేదా 1.5 మి.లీ బుఫ్రోపెజిన్ + 2 మి.లీ హెక్సాకోనజోల్ లేదా 2 గ్రాములు మాంకోజెబ్, కార్బండిజమ్ కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. తోటలకు నీరు తక్కువగా పెట్టడంతో పాటు శుభ్రంగా ఉంచుకుంటే తెగుళ్ల ఉధృతి తగ్గుతుందని తెలిపారు.
ఉద్యానశాఖ డీడీ నరసింహారావు
Comments
Please login to add a commentAdd a comment