ఫైనాన్స్ కంపెనీలో భారీగా బంగారం మాయం
● మేనేజర్‌పై అనుమానం
ఉరవకొండ: పట్టణంలోని ఓ ప్రముఖ గోల్డ్ లోన్ ఫైనాన్స్ కంపెనీలో భారీగా బంగారం మాయమవడం చర్చనీయాంశమైంది. తాకట్టు పెట్టిన బంగారు నగలు కనిపించకపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, సదరు ఫైనాన్స్ కంపెనీ బ్రాంచి మేనేజరే నగలను కాజేశాడనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గోల్డ్ లోన్ ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో అక్కడి నుంచి ఆడిటర్లు ఉరవకొండకు చేరుకుని ఆరా తీశారు. దాదాపు కేజీ పైగా బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. శనివారం ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉరవకొండ అర్బన్ సీఐ మహనంది విచారణ చేపట్టారు. ఫైనాన్స్ కంపెనీ ఆడిటర్ల నుంచి వివరాలు సేకరించారు. సదరు ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్ మేనేజర్ తన సొంత అవసరాలకు బంగారు ఆభరణాలను మరో చోట తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలిపారు.
రేషన్ దుకాణాలకు
‘గాలి ప్యాకెట్లు’
తాడిపత్రి రూరల్: కూటమి ప్రభుత్వంలో ఇదో వింత. రేషన్ దుకాణాలకు కంది బేడల ప్యాకెట్లను సరఫరా చేయాల్సి ఉండగా, కేవలం కవర్‌లో గాలిని నింపి పంపించారు. మండలంలోని చిన్నపొలమడ వద్ద గల రైస్ గోడౌన్‌ను శనివారం పౌరసరఫరాల శాఖ డీఎం రమేష్‌రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొందరు డీలర్లు తమకు కందిబేడల స్థానంలో గాలితో నిండిన ప్యాకెట్లు సరఫరా చేశారని డీఎం దృష్టికి తీసుకెళ్లారు. గోడౌన్ అధికారులకు చెబితే ‘సర్దుకు పోండి’ అంటూ ఉచిత సలహా ఇచ్చారని వాపోయారు. దీంతో గోడౌన్ సిబ్బందిపై డీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడౌన్‌లో తూకాల్లో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బియ్యం బస్తాలను గోడౌన్ నుంచి తీసుకెళ్లేటప్పుడు తప్పనిసరిగా తూకాలు వేసుకోవాలని డీలర్లకు సూచించారు.
గుప్త నిధుల కోసం
శివలింగం తొలగింపు
కుందుర్పి: నరసంపల్లి సమీపంలోని పురాతన శివాలయంలో గుప్త నిధుల కోసం శివలింగం, నంది విగ్రహాన్ని తొలగించారు. వివరాలు.. కుందుర్పి–అల్లాపురం మార్గంలో పురాతన శివాలయం ఉంది. ఏడాది క్రితం వరకూ అర్చకుడు చంద్రప్ప అక్కడే నివాసముండేవారు. అక్కడ సౌకర్యాల లేమితో కుందుర్పికి మకాం మార్చాడు. దీంతో ఆలయం వద్ద జనసంచారం లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు శనివా రం రాత్రి గుప్తనిధుల కోసం శివలింగం, నంది విగ్రహాలను పక్కకు తోసేసి 4 మీటర్లు లోతు వరకు తవ్వకాలు జరిపారు. ఇదిలా ఉండగా 2 నెలల క్రితం మలయనూరు పంచలింగాల ఆలయం, ఇటీవల ఎనుములదొడ్డి శివాలయాల్లోనూ ఇలాగే తవ్వకాలు జరిపారు. ఇప్పటికై నా పోలీసులు గుప్తనిధుల తవ్వకాలపై నిఘా పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఖాద్రీ ఆలయంలో
ధన్మురాస శోభ
కదిరి టౌన్: నవ నారసింహుని క్షేత్రాల్లో కెల్లా భక్త ప్రహ్లాద సమేత స్వయంభుగా వెలసింది శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. శుభకరమైన ధనుర్మాస, మార్గశిర మాసం చివరి శనివారం పవిత్ర శనిత్రయోదశి అనూరాధ నక్షత్రం రోజు శ్రీఖాద్రీ నృసింహుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment