కూటమి సర్కారు కక్ష సాధింపు
సాక్షి టాస్క్‌ఫోర్స్: ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపిన వైఎస్సార్ సీపీ నేతలపై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఉరవకొండ నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఒత్తిడితో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఈనెల 27న పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. స్థానిక ఉరగాద్రి కల్యాణ మండపం నుంచి విద్యుత్ శాఖ ఏడీ కార్యాలయం వరకు నిర్వహించిన ‘విద్యుత్ పోరుబాట’ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.
విశేష స్పందనను జీర్ణించుకోలేక..: ‘విశ్వ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభించింది. దీన్ని జీర్ణించుకోలేని ‘పచ్చ’ నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి అక్రమ కేసులు బనాయించడం గమనార్హం. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి, ప్రజలు ఇబ్బంది పడేలా చేశారని ఓ టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు, విధులకు ఆటంకం కలిగించారంటూ ఏడీ భాస్కర్ చేసిన మరో ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే విశ్వతో పాటు మరో 16 మంది పార్టీ ముఖ్య నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఏకపక్షంగా.. : అధికార పార్టీ నేతలకు జీ హుజూర్ అంటూ వారు చెప్పినట్టల్లా వ్యవహరిస్తున్న ఉరవకొండ పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నాయకులను వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ‘పోరుబాట’ ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకపోయినా.. ఓ టీడీపీ నేత ఫిర్యాదు చేయగానే కేసు నమోదు చేశారంటే పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉరవకొండలో గత రెండు నెలల వ్యవధిలోనే 20కు పైగా చోరీలు జరిగాయి. వీటిలో ఇప్పటి వరకూ పోలీసులు కనీస పురోగతి సాధించలేకపోయారు. పట్టపగలే దొంగలు సవాల్ విసురుతున్నా మొద్దు నిద్రపోతున్నారు. దీంతో పాటు నియోజకవర్గంలో విచ్చలవిడిగా మట్కా, పేకాటతో పాటు బియ్యం, ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ఇక.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు జరిగాయి. పోలీసుల సమక్షంలోనే ‘పచ్చ’ మూకలు రెచ్చిపోయి దాడులకు దిగాయి. కొందరు వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఉరవకొండలో కొంతమంది వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకులతో బలవంతంగా పార్టీకి రాజీనామా చేయించాలని చూస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్పందించని పోలీసులు.. వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేయడంలో మాత్రం ఉత్సాహం చూపుతుండటం గమనార్హం.
అక్రమ కేసులకు భయపడేది లేదు
మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు ఉరవకొండ పోలీసులు, అధికార యంత్రాంగం పనిచేస్తుండటం సిగ్గుచేటు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ర్యాలీ చేసినా మంత్రి కేశవ్ జీర్ణించుకోలేకపోతున్నారు. నాతో పాటు పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం. కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తాం. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు అండగా ఉంటాం.
– విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే విశ్వతో సహా 16 మందిపై కేసులు
ఆర్థిక మంత్రి కేశవ్ ఇలాకాలో పోలీసుల పక్షపాతం
Comments
Please login to add a commentAdd a comment