ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో గత నవంబరులో నిర్వహించిన డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఎస్కేయూ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లోకేష్, కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ చేతుల మీదుగా కళాశాలలో విడుదల చేశారు. మూడో సెమిస్టర్ ఫలితాల్లో బీఏలో 71 శాతం, బీకాంలో 62 శాతం, బీఎస్సీలో 68 శాతం, బీబీఏలో 83 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఐదో సెమిస్టర్‌లో బీఏలో 88 శాతం, బీకాంలో 81 శాతం, బీఎస్సీలో 80 శాతం, బీబీఏలో 92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రామకృష్ణ, పరీక్షల విభాగం అధికారులు చలపతి, శ్రీనివాసులు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య యోజనతో
ఫ్రీ హెల్త్ చెకప్‌కు చర్యలు
అనంతపురం అర్బన్: ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ‘వన్ హాస్పిటల్ – వన్ విలేజ్’లో ఫ్రీ హెల్త్ చెకప్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆరోగ్య యోజనకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య యోజన కింద 6.76 లక్షల మంది లబ్ధిదారులను నమోదు చేయాల్సి ఉండగా.. 6.27 లక్షల మంది నమోదు పూర్తయిందన్నారు. మిగిలిన వారి నమోదు త్వరగా పూర్తి చేయాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్‌తో సమన్వయం చేసుకుని మండలాల్లోని సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయాష్మాన్ భారత్ కార్డుకు సంబంధించి ప్రత్యేకంగా నమోదు చేయడం ద్వారా లబ్ధిదారులు దేశవ్యాప్తంగా వైద్యసేవలు పొందే అవకాశం ఉంటుందన్నారు. నమోదు, కార్డుల మంజూరుపై దృష్టి పెట్టాలన్నారు. అన్ని పీహెచ్‌సీల్లోనూ నమోదు పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాలను ఎన్‌టీఆర్ వైద్యసేవలో అప్‌లోడ్ చేయాలని చెప్పారు. సమావేశంలో ఎన్‌టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్ పాల్ రవికుమార్, డీపీఎం రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.
ఆ దున్నపోతు మాదే!
● ఇరు గ్రామాల మధ్య రాజుకున్న వివాదం
● ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ముద్దలాపురం గ్రామస్తులు
అనంతపురం: దేవర దున్నపోతు కోసం రెండు గ్రామాల మధ్య వివాదం రాజుకుంది. కూడేరు మండలం ముద్దలాపురంలో ముత్యాలమ్మ, కదరగుంటలో బొడ్రాయి ప్రతిష్ట సందర్భంగా దేవర నిర్వహణకు గ్రామస్తులు పూనుకున్నారు. ఇందు కోసం దేవరలో బలి ఇచ్చేందుకు గ్రామానికి ఒక దున్నపోతును వదిలారు. ఈ రెండు దున్నపోతులు నాలుగేళ్లుగా సమీప గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఈ నెల 22న దేవర ఉండడంతో ఇటీవల గ్రామంలోకి వచ్చిన దున్నపోతును కదరకుంట గ్రామస్తులు కట్టేశారు. 21వ తేదీన ముద్దలాపురంలో దేవర ఉంది. దీంతో పక్క గ్రామంలో కట్టేసిన దున్నపోతు తమ గ్రామానికి చెందినదేనని ముద్దలాపురం గ్రామస్తులు నిర్ధారణకు వచ్చారు. తమ దున్నపోతును వదిలేస్తు దేవర చేసుకుంటామని కోరగా కడదరకుంట గ్రామస్తులు ఇందుకు ససేమిరా అన్నారు. అది తమదేనని ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుండడంతో ముద్దలాపురం గ్రామస్తులు శుక్రవారం ఎస్పీని కలిసేందుకు కార్యాలయానికి వెళ్లారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించే సోమవారం రోజున రావాలంటూ సిబ్బంది సూచించడంతో గ్రామస్తులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment