25 వరకే సాగునీరు
● హెచ్చెల్సీ ఎస్‌ఈ రాజశేఖర్
పెద్దవడుగూరు : తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు ఈ నెల 25 వరకే సాగునీరందిస్తామని ఎస్‌ఈ రాజశేఖర్ స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దవడుగూరు మండలం మిడుతూరు, పెద్దవడుగూరు, లక్ష్ముంపల్లి గ్రామాల సమీపంలోని హెచ్చెల్సీని ఈఈ అబ్దుల్ సలీమ్, డీఈ వెంకటరమణారెడ్డితో కలిసి ఎస్‌ఈ పరిశీలించారు. యాడికి మండలం రాయలచెరువుకు నీరు అందించడానికి అధికారులు తీసుకున్న చర్యలను గురించి ఆరా తీశారు. గురువారం సాయంత్రం నుంచి 17వ కాలువకు నీరు రాకపోవడంతో లక్ష్ముంపల్లి, పెద్దవడుగూరు చిన్నవడుగూరు, దిమ్మగుడి గ్రామాల రైతులు యాడికి కాలువ గేట్ల వద్ద వచ్చారు. అధికారులు సాగునీరు యాడికి మండలానికి తరలించే చర్యలను చూసి.. చివరి ఆయకట్టు రైతుల కడుపులు కొట్టొద్దని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు దిగువకు సాగునీరు అందించడానికి చర్యలు తీసుకున్నారు. రెండు మండలాలకు సాగునీరు అందించడానికి కృషి చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని అన్నారు. కొత్తగా రైతులు పంటలు సాగు చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఈఈ మానస, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment