వినూత్నంగా ఆలోచించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: కాలానుగుణంగా విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి కొత్త ఆవిష్కరణలు చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాప్తాడు మోడల్ స్కూల్‌లో జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన–2025 (సైన్స్‌ఫేర్) నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు వివిధ అంశాలపై తయారు చేసిన ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. మూడు కేటగిరీల్లో తొమ్మిది (ప్రథమ, ద్వితీయ, తృతీయ) ప్రాజెక్ట్‌లను ఎంపిక చేశారు. వీటిల్లో మొదటి, రెండోస్థానంలో నిలిచిన ప్రాజెక్ట్‌లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయి. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ విజయం సాధించాలంటే అనేక అంశాలు ఇమిడి ఉంటాయన్నారు. పాఠ్య పుస్తకాలతోనే కాకుండా ఇంటర్నెట్, ఇతర మార్గాల్లో తాము ఎంచుకున్న అంశాలపై ప్రాజెక్ట్‌లు తయారు చేయడం అభినందనీయమన్నారు. జిల్లా ప్రాజెక్ట్‌లు రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రదర్శనలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు పోటీ ప్రపంచంలో భిన్నంగా ఆలోచించడమే కాకుండా కృషి, పట్టుదలతో చదువుకున్నప్పుడే లక్ష్యం సాధిస్తారన్నారు. ఎమ్మెల్సీ మంగమ్మ మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్‌లు చాలా బాగున్నాయన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారన్నారు. తాము తింటున్న ఆహారం ఎలా తయారవుతుందో కూడా చాలామంది విద్యార్థులకు తెలీదన్నారు. వ్యవసాయం పట్ల కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. జిల్లాస్థాయి ప్రదర్శనలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పరిటాల సునీత రూ.లక్ష విరాళం ప్రకటించారు. అనంతరం విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ ప్రసాద్‌బాబు, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ విజయకుమారి, ఎంఈఓ మల్లికార్జున, జిల్లా సైన్స్ అధికారి బాలమురళి, డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
వ్యక్తిగత విభాగంలో : ఆర్.శంకర్‌నాథ్‌రెడ్డి 9వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్ రాప్తాడు (ప్రథమ), బి.వంశీ 9వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్ కసాపురం, గుంతకల్లు (ద్వితీయ), ఎల్.నవిక 8వ తరగతి ఎంపీయూపీఎస్ హొసగుడ్డం, డి.హీరేహాళ్ మండలం (తృతీయ).
గ్రూపు విభాగంలో : పి.గీతారెడ్డి–డి.మహలక్ష్మీ 9వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్ హనకనహల్, కణేకల్లు (ప్రథమ), జె.హర్షిణి–కె.చరిత 9వ తరగతి, జెడ్పీహెచ్‌ఎస్ శనగలగూడూరు, పుట్లూరు (ద్వితీయ), పి.యజ్నశ్రీ –సి.మధురిమ 8వ తరగతి ఏపీఎంఎస్ తాడిపత్రి (తృతీయ).
టీచర్స్ విభాగంలో : బండి శ్రీనివాస్, జెడ్పీహెచ్‌ఎస్ ఆమిదాల, ఉరవకొండ (ప్రథమ), ఎన్.కృష్ణమోహన్‌రెడ్డి జెడ్పీహెచ్‌ఎస్ పెద్ద ఎక్కలూరు, పెద్దపప్పూరు (ద్వితీయ), బి.మహమ్మద్ రఫి జెడ్పీహెచ్‌ఎస్ కరుట్లపల్లి, కూడేరు (తృతీయ).
రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలి
జిల్లాస్థాయి సైన్ ్సఫేర్ ముగింపులో కలెక్టర్ వినోద్‌కుమార్
రాష్ట్రస్థాయికి తొమ్మిది ప్రాజెక్ట్‌ల ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment