నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు బుధవారం నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్థాయీ సంఘం–1, 2, 4, 7 (ఆర్థిక, ప్రణాళిక/గ్రామీణాభివృద్ధి/విద్య, వైద్యం /ఇంజినీరింగ్ శాఖ) సమావేశాలు జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన ప్రధాన మందిరంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. స్థాయీ సంఘం–3, 5, 6(వ్యవసాయం/ఐసీడీఎస్/సాంఘిక సంక్షేమ శాఖ) సమావేశాలు అదనపు భవన్‌లో ఆయా సంఘ అధ్యక్షుల అధ్యక్షతన నిర్వహించనున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఆయా శాఖల అధికారులు సమగ్ర వివరాలతో సమావేశాలకు హాజరుకావాలని స్పష్టం చేశారు.
నేడు జిల్లాకు కేంద్ర బృందం
అనంతపురం అగ్రికల్చర్: కరువు పరిస్థితులు తెలుసుకునేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన ముగ్గురు సభ్యుల ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం బుధవారం జిల్లాలో పర్యటించనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనంతపురం రూరల్ మండలం మన్నీలతో పాటు రాప్తాడులో పంట పొలాల సందర్శన, రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. కరువు జాబితాలో ప్రకటించిన 7 మండలాల్లో రూ.19 కోట్ల నష్టం జరిగినట్లు ఇప్పటికే పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ) నివేదికను జిల్లా అధికారులు సిద్ధం చేశారు. పశుశాఖ, ఉద్యానశాఖ, డ్వామా తదితర శాఖల పరిధిలో కూడా జిల్లాకు కేంద్రం నుంచి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని నివేదించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర బృందం పర్యటన నేపథ్యంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ మంగళవారం తన చాంబర్‌లో ఏడీఏ ఎం.రవి, ఏఓలు బాలానాయక్, శశికళ తదితరులతో సమావేశం నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
హోరాహోరీగా ఇన్‌స్పైర్
కప్ ఫుట్‌బాల్ టోర్నీ
అనంతపురం: అనంతపురం స్పోర్ట్స్ విలేజ్‌లో లాలిగా ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్ కప్ ఫుట్‌బాల్ టోర్నీ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటుండగా.. 216 మంది మహిళా క్రీడాకారిణులు హాజరయ్యారు. నర్మద వ్యాలీ (మధ్యప్రదేశ్), థామ్ (తమిళనాడు), లైఫ్ స్టోర్స్ (తమిళనాడు), నంది ఫౌండేషన్ (గుజరాత్), అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ (ఆంధ్రప్రదేశ్), స్పోర్ట్స్, ఫుట్‌బాల్ అకాడమీ (తమిళనాడు), ఫాల్కన్ గర్ల్స్ (ఒడిశా), లిబర్టీ లేడీస్ (తమిళనాడు), బెంగళూరు (కర్ణాటక) జట్ల మధ్య మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగాయి.
సహకార సంఘాలను మరింత బలోపేతం చేద్దాం
బెళుగుప్ప: సహకార వ్యవసాయ పరపతి సంఘాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రైతులను కలుపుకుని ముందుకు సాగాలని ఉభయ తెలుగు రాష్ట్రాల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కో–ఆపరేటివ్ మేనేజ్‌మెంట్ (ఐసీఓఎం) కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎస్‌ఎల్‌ఎన్‌టీ శ్రీనివాస్ అన్నారు. బెళుగుప్పలోని పీఏసీఎస్‌లో ఏడీసీసీ హెచ్‌ఓ ఆర్‌వీ కృష్ణారెడ్డి, ఏజీఎం లక్ష్మీప్రసన్న, ఏఎం హరిణి, సీఈఓ పాండురంగతో కలసి సహకార సంఘాల నిర్వహణపై రైతులకు ఆయన అవగాహన కల్పించారు. సంఘం బలోపేతానికి చేపట్టాల్సిన అంశాలపై రైతుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment