మీతో వేగలేం బాబోయ్!
అనంతపురం కార్పొరేషన్: అనంత పురం నగరపాలక సంస్థలో పని చేయాలంటే అధికారులు వణికిపోతు న్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గలేక సెలవుల బాట పడుతున్నారు. తాజాగా నగరపాలక సంస్థ కమిషనర్ రామలింగేశ్వర్ ఈ నెల 7 నుంచి వచ్చే నెల 2 వరకు సెలవులో వెళ్లడం చర్చనీయాంశమైంది.
22 రోజుల్లోనే తిరుగుముఖం..
తాము చెప్పినట్టల్లా సీ బిల్లులు చేయాలని, అభివృద్ధి పనుల కాంట్రాక్టులను తమ వారికే అప్పగించాలంటూ ఒత్తిడి చేయడంతో ఈ నెల 15న కమిషనర్ నాగరాజు దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారు. దీంతో ప్రభుత్వం మరుసటి రోజే అదనపు కమిషనర్‌గా ఉన్న రామలింగేశ్వర్‌కు కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, చార్జ్ తీసుకున్న 22 రోజుల్లోనే ఆయన కూడా సెలవు పెట్టడం గమనార్హం. పైగా తన సెల్‌ను సైతం నగరపాలక సంస్థలో అప్పగించి వెళ్లారంటే ఒత్తిళ్లు ఏ మేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇష్టారాజ్యంగా బిల్లులు..
కూటమి ప్రభుత్వం వచ్చాక నగరపాలక సంస్థలో సీ బిల్లులకు రెక్కలు వచ్చాయి. ఓ ఏఈ కనుసన్నల్లో ఇప్పటికే రూ.80 లక్షల వరకు సీ బిల్లులు పెట్టినట్లు సమాచారం. వాస్తవంగా రూ.లక్ష దాటాక సీ బిల్లులు పెట్టరాదు. కానీ, నగరపాలక సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీబిల్లులు పెడుతున్నారు. అందులో నగరపాలక సంస్థ ఇంజినీర్లు, అకౌంటెంట్ సిబ్బంది పరోక్షంగా టీడీపీ నాయకులకు సహకరిస్తున్నట్లు తెలిసింది. పర్సెంటేజీలు తీసుకుని ఓ ఏఈ, అకౌంట్ సెక్షన్ సిబ్బంది సీ బిల్లులు ఆమోదిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో పాటుగా బయోమైనింగ్ బిల్లులు చేయాలని నగరపాలక సంస్థ అధికారులపై టీడీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో ఎటూపాలుపోని పరిస్థితిలో అధికారులు పక్కకు తప్పుకుంటున్నారు.
గతంలోనూ ఇంతే...
2014 నుంచి 2019 వరకూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి దుస్థితే ఉండేది. అప్పట్లో కమిషనర్లుగా పని చేసిన చల్లా ఓబులేసు, సురేంద్రబాబు, ఉమామహేశ్వర్ అర్ధంతరంగా సెలవులో వెళ్లిపోయారు. కొందరు కమిషనర్లు అధికార పార్టీ నేతలతో తిట్లు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో కూడా నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుండటంతో అధికారులు సెల వులో వెళ్లిపోతుండటం చర్చనీయాంశమైంది.
● అనంతపురం నగరపాలక కమిషనర్ రామలింగేశ్వర్ సుదీర్ఘ సెలవు
● బాధ్యతలు తీసుకున్న
22 రోజుల్లోనే తిరుగుముఖం
● ఇప్పటికే సెలవులో రెగ్యులర్ కమిషనర్
● కూటమి నేతల ఆగడాలతో బెంబేలు
● ఐఏఎస్ అధికారి వస్తేనే మేలు
Comments
Please login to add a commentAdd a comment