కోర్టు కేసులు తేలిగ్గా తీసుకోవద్దు | - | Sakshi
Sakshi News home page

కోర్టు కేసులు తేలిగ్గా తీసుకోవద్దు

Published Wed, Jan 8 2025 12:34 AM | Last Updated on Wed, Jan 8 2025 12:34 AM

కోర్టు కేసులు తేలిగ్గా తీసుకోవద్దు

కోర్టు కేసులు తేలిగ్గా తీసుకోవద్దు

అనంతపురం అర్బన్‌: కోర్టు కేసులు తేలిగ్గా తీసుకోకుండా జవాబుదారీతనంతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు కేసులకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో నోడల్‌ అధికారులను నియమించామని, సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు న్యాయం జరగనప్పుడే కోర్టును ఆశ్రయిస్తారన్నారు. సమస్యలకు కచ్చితమైన పరిష్కారం చూపినప్పుడే యంత్రాంగంపై నమ్మకం కలుగుతుందన్నారు. కేసుల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ రూల్‌ పొజిషన్‌ ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. కోర్టు కేసుల్లో ఎవరు ధిక్కరణలో ఉంటారో వారి వివరాలు తెలపాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎ.మలోల, కలెక్టరేట్‌ ఏఓ అలెగ్జాండర్‌, మెజిస్టీరియల్‌ విభాగం సూపరింటెండెంట్‌ వసంతలత, తదితరులు పాల్గొన్నారు.

అర్జీల పరిష్కారంలో నాణ్యత లేదు

సమస్యలపై ప్రజల నుంచి అందుతున్న అర్జీలను నాణ్యతగా పరిష్కరించడంలో వెనుకబడి ఉన్నారంటూ కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యుటేషన్లు, కరెక్షన్లు, ఎఫ్‌లైన్‌ పిటీషన్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, తదితర అంశాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించి ఉంటే వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. పొజిషన్‌ సర్టిఫికెట్లలో లబ్ధిదారుని ఫొటోతో పాటు భూమి వివరాలు ఉండాలని ఆదేశించారు. ఈ పాసు పుస్తకాలు పొందేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

ఉరవకొండ: రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సూచించారు. మంగళవారం మండల పరిధిలోని రేణుమాకుపల్లిలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. 1910 నుంచి 1925 వరకు బ్రిటిష్‌ వారు భూముల సర్వే చేశారని, మళ్లీ వందేళ్ల అనంతరం ఇప్పుడు వాటిలో దోషాలను సరిద్దిదడానికి రీ సర్వే చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి రీసర్వేకు సంబంధించి ఎలాంటి నోటీసు వచ్చినా రైతులు జాగ్రత్తగా ఉంచుకోవాలని, కొలతల్లో తేడాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఫైనల్‌ చేసిన తరువాత భూమి ఎంత ఉంటే అంతేనని, అందులో ఏమీ మార్పు ఉండదని తెలిపారు. అనంతరం 10 మంది లబ్ధిదారులకు ఇంటి హక్కు పత్రాలను కలెక్టర్‌ అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ తిప్పేనాయక్‌, బీసీ వెల్ఫేర్‌ డీడీ ఖుష్బూకొఠారి, తహసీల్దార్‌ మహబూబ్‌బాషా, ఎంపీడీఓ రవిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

రోగులకు నాణ్యమైన సేవలందించాలి

అనంతపురం మెడికల్‌: ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలందించాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ వైద్యులను ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని రక్తనిధి కేంద్రం, జేఎన్‌టీయూ సమీపంలోని కేన్సర్‌ ఆస్పత్రి, పాతూరు సీడీ ఆస్పత్రి, రెడ్‌క్రాస్‌ రక్తనిధి కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. పాతూరు సీడీ ఆస్పత్రిలో రోగులకందుతున్న సేవలపై కలెక్టర్‌ ఆరా తీశారు. రోజూ 300 నుంచి 400 మంది వైద్యం పొందుతుంటారని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పాల్‌ రవికుమార్‌ కలెక్టర్‌కు వివరించారు. శారదనగర్‌లో ఉన్న కేన్సర్‌ యూనిట్‌ను పరిశీలించి, రోగులు ఉత్తమ సేవలందించాలని సూచించారు. కలెక్టర్‌ వెంట డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భ్రమరాంబ దేవి, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వర రావు, డిప్యూటీ ఆర్‌ఎంఓలు డాక్టర్‌ హేమలత, డాక్టర్‌ పద్మజ, తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement