వ్యవసాయ రంగం కాంతులీనింది. పరిశ్రమల రంగం పరుగులు పెట్టి
● 2022–23లో ‘జీవీఏ’లో జిల్లా దూకుడు
● తాజాగా అందుబాటులోకి గణాంకాలు
● వ్యవసాయ ఉత్పత్తుల్లో
రూ.24 వేల కోట్ల పైగా వృద్ధి
● కూటమి ప్రభుత్వం వచ్చాక దారుణంగా పరిస్థితులు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో జిల్లా పురోగతి సాధించింది. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయ వనరులు సమకూరాయి. తాజాగా అందుబాటులోకి వచ్చిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. 2022–23 స్థూల ఉత్పత్తి విలువ(గ్రాస్ వ్యాల్యూ యాడెడ్–జీవీఏ)పై గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో వివిధ రంగాల్లో జిల్లా పురోగతిపై చర్చించారు. ‘రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్ర’గా చెప్పుకునే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కంటే కూడా అనంతపురం జిల్లా ముందంజలో ఉన్నట్టు తేలింది.
వ్యవసాయ రంగంలో గణనీయ వృద్ధి..
ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో జిల్లాలో వ్యవసాయ రంగం భారీగా పురోభివృద్ధి సాధించింది. నదీ పరివాహక ప్రాంతాలైన గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలతో పోల్చినా అనంతపురమే ముందంజలో నిలిచింది. రకరకాల పండ్లతోటలు, ఎగుమతులతో గణనీయంగా ఆదాయం చేకూరింది. ఇక్కడి ఫలాలు వివిధ రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి అయ్యాయి. పుష్కలంగా వర్షాలు పడటం, రైతుకు సమయానికి ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద సాయం అందడం వంటి వాటితో వ్యవసాయ రంగం రూ.24 వేల కోట్ల మార్కు దాటింది. స్థూల ఉత్పత్తి విలువలో 3వ ర్యాంకు సాధించింది.
పరిశ్రమల రంగంలోనూ..
గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు, సర్వీసు రంగాల్లోనూ భారీ పురోగతి కనిపించింది. ఎంఎస్‌ఎంఈల స్థాపన, సర్వీసు రంగం (వాహన సేవలు) వంటివాటితో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పన సాకారమైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పరిశ్రమల రంగంలో రూ.13 వేల కోట్ల విలువను సూచించింది. సేవల రంగంలో సైతం రూ.939 కోట్లతో రాష్ట్రంలోనే జిల్లా 7వ స్థానంలో నిలిచింది. అన్ని రంగాల్లో కలిపితే రూ.59 వేల కోట్ల పైచిలుకు ఉత్పత్తితో 26 జిల్లాల్లో 6వ స్థానం సంపాదించుకుంది.
నాటి కళ ఏదీ..?
కూటమి సర్కారు పాలనా పగ్గాలు చేపట్టి ఏడు మాసాలు కావస్తోంది. ఈ కొద్ది కాలంలోనే పరిస్థితులు దారుణంగా మారాయి. కొత్త పరిశ్రమలు రాక పారిశ్రామిక రంగం కుదేలైంది. రైతుకు భరోసా లేకుండా పోయింది. పంట పండినా గిట్టుబాటు కాకపోవడం వంటి కారణాలతో అన్నదాతకు నష్టాలే మిగులుతున్నాయి. ఇక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో ఉద్యోగ, ఉపాధి కల్పన అటకెక్కింది. జిల్లాలో ఎక్కడ చూసినా ‘పచ్చ’ నేతల దౌర్జన్యాలు, బెదిరింపుల ప్రభావం ఆయా రంగాలపై తీవ్రంగా పడుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment