‘పది’ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
అనంతపురం ఎడ్యుకేషన్: వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ) ఎం. ప్రసాద్‌బాబు ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం అనంతపురం రూరల్ మండలం చియ్యేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులతో మాట్లాడారు. అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఏయే సబ్జెక్టుల్లో ఎంత సిలబస్ జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘వందరోజుల యాక్షన్ ప్లాన్’ గురించి ఆరా తీశారు. రోజూ షెడ్యూలు ప్రకారం స్పెషల్ తరగతులు జరుగుతున్నాయా? అని అడిగారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులలకు మంచి బహుమతి ఇస్తానని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థుల పట్ల మరింత దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ఎవరికి వారు తమ సబ్జెక్టులో పిల్లలందరూ ఉత్తీర్ణులవ్వాలనే లక్ష్యం పెట్టుకోవాలన్నారు. పాఠశాలలో సొంత ఖర్చులతో వినాయకుడి ఆలయం నిర్మించిన ఆంగ్ల ఉపాధ్యాయుడు కె. భాస్కర్ రెడ్డిని అభినందించారు. గతంలో పాఠశాల విద్యార్థులకు విమాన ప్రయాణ అవకాశం కల్పించిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బి. నాగేంద్రకు అభినందనలు తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీ లించి నాణ్యతపై విద్యార్థులతో ఆరా తీశారు. రోజూ మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని అడిగారు. డీఈఓ చేతుల మీదుగా విద్యార్థులకు ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు నాగేంద్ర, ప్రసాద్ నాయుడు, ఉమా మహేశ్వర్, భాస్కర్ రెడ్డి, పుల్లయ్య, నివేదిత రాణి, నాగమణి, విజయ భారతి, నళినాక్షి, మంజునాథ్, క్లర్క్ సూర్య నారాయణ పాల్గొన్నారు. అనంతరం డీఈఓ ఆకుతోటపల్లి ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.
డీఈఓ ప్రసాద్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment