తిరుపతి ఘటనకు సీఎం బాధ్యత వహించాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం కార్పొరేషన్: తిరుపతిలో ఆరుగురు భక్తుల మృతికి సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనకు మాత్రం వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారన్నారు. ఇంత జరిగినా హిందుత్వం గురించి మాట్లాడే నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని, మౌనంగా ఉండటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మంచి జరిగితే తన గొప్ప అని చెప్పుకోవడం, చెడు జరిగితే వైఎస్సార్ సీపీపై అపవాదు మోపడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని విమర్శించారు. తిరుపతి చరిత్రలో ఎన్నడూ ఇటువంటి దారుణమైన ఘటన చోటు చేసుకోలేదన్నారు. కొందరు అధికారులను మాత్రమే ఇందుకు బాధ్యులను చేయడం దుర్మార్గమన్నారు. మృతులు, క్షతగాత్రులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టోకన్ల పద్ధతిని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని కొందరు ప్రచారం చేస్తున్నారని, టోకన్ల పద్ధతి ప్రవేశపెట్టినా పకడ్బందీ ఏర్పాట్లు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులకే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మళ్లీ నేడు శంకుస్థాపన చేయడం దౌర్భాగ్యమన్నారు. కూటమి ప్రభుత్వ ఏడు నెలల కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment