సీనియర్ జర్నలిస్ట్ జెమినీ ప్రసాద్ దేహదానం
అనంతపురం మెడికల్: ఆరు దశాబ్దాల పాటు కలం పోరాటంతో ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సీనియర్ జర్నలిస్ట్ నందినేని దేవప్రసాద్ అలియాస్ జెమినీ ప్రసాద్ మృతి అనంతరం ఆయన భౌతిక కాయాన్ని వైద్య కళాశాలకు అప్పగించారు. ఈ నెల 6న ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం అనంతపురంలోని ప్రెస్‌క్లబ్ నుంచి భారీ ర్యాలీగా బోధనాస్పత్రికి ఆయన భౌతిక కాయాన్ని జర్నలిస్టులు తరలించి ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావుకు అప్పగించారు. కళాశాలలోని అనాటమీ డిపార్ట్‌మెంట్‌లో ఆయన శరీరాన్ని భద్రపరిచారు. అన్ని దానాల్లోకెల్లా దేహదానం చాలా గొప్పదని, ఎంతో మంచి మనసు ఉంటే తప్ప అంత గొప్ప పని చేయడం సాధ్యం కాదని ఈ సందర్భంగా డాక్టర్ మాణిక్యరావు కొనియాడారు. మానవ అంతర్ నిర్మాణ శాస్త్ర అధ్యయనానికి దేహదానం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో అనాటమీ ప్రధాన విభాగాధిపతి డాక్టర్ ఎస్.ఉమామహేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టులు ఆజాద్, చల్లా నాయుడు, తలారి రామాంజినేయులు, నాగభూషణం, విశ్వనాథ్, సుధాకర్, చంద్ర, రామాంజినేయులు, శ్రీరాములు, నాగభూషణం, బోగేశ్వరరెడ్డి, నందుటైమ్స్ భాస్కరరెడ్డి, రామలింగారెడ్డి, మంజునాథ్, శ్రీనివాసరెడ్డి, 150 మందికిపైగా జర్నలిస్టులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment