పెల్లుబుకిన లాయర్ల ఆగ్రహం
అనంతపురం: సీనియర్ న్యాయవాది బీవీ శేషాద్రి మృతికి కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాదులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఐదో రోజు శుక్రవారం తారస్థాయికి చేరుకుంది. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి అనంతపురం రేంజ్ డీఐజీ కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం వద్ద న్యాయవాదులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. న్యాయవాదులను డీఎస్పీ వి.శ్రీనివాసరావు అడ్డుకుని నినాదాలు చేయరాదంటూ ఆక్షేపించారు. దీంతో న్యాయవాదుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. తప్పు చేసిన సీఐ శాంతిలాల్‌పై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా న్యాయం కోరుతున్న తమనే ఆక్షేపించడాన్ని న్యాయవాదులు తప్పుబట్టారు. దీంతో న్యాయవాదులతో డీఎస్పీ వాగ్వాదానికి దిగారు. అనంతరం పలువురు న్యాయవాదులు డీఐజీ కార్యాలయానికి చేరుకుని శేషాద్రి మృతికి కారణమైన సీఐ శాంతిలాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ డీఐజీ షిమోషికి వినతిపత్రం అందజేశారు. సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యం నశించాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుప్రసాద్, సీనియర్ న్యాయవాదులు గోవిందరాజులు, వెంకట్రాముడు, జనరల్ సెక్రెటరీ రాజేంద్రప్రసాద్, సీనియర్ న్యాయవాదులు గాజుల ఉమాపతి, బడా నారాయణరెడ్డి, హనుమన్న, పుల్లయ్య బాబు, బాలకృష్ణ, రాజారెడ్డి, గడియారం మల్లికార్జున శర్మ, పద్మజ, యమున, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment