చిన్నోడే.. దందాల్లో చాలా పెద్దోడు | - | Sakshi
Sakshi News home page

చిన్నోడే.. దందాల్లో చాలా పెద్దోడు

Published Mon, Jan 6 2025 8:30 AM | Last Updated on Mon, Jan 6 2025 3:39 PM

-

రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యనేత కుమారుడి లీలలు

పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి వసూళ్లు

రూ. 2 కోట్లు ఇవ్వాలని ఓ బిల్డర్‌కు బెదిరింపులు

రూ. 3 కోట్లు ఇవ్వాలని ఇంకో రియల్టర్‌కు డిమాండ్‌

తాము టీడీపీ వాళ్లమన్నా కుదరదని తెగేసి చెప్పిన వైనం

ఇప్పటికే మట్టి, గ్రావెల్‌ మాటున యథేచ్ఛగా దోపిడీ

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాప్తాడు నియోజక వర్గంలో ఓ ముఖ్య నేత కుమారుడు డాన్‌లా వ్యవహరిస్తూ దోపిడీ రాజ్యానికి తెరతీశాడు. రాప్తాడుకు చెందిన కీలక నేత చిన్న కుమారుడు కూటమి సర్కారు కొలువుదీరిన రోజు నుంచే పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య వర్గాలపై పడ్డాడు. ప్రతి వారినీ పిలిపించుకొని ఎంత ఇవ్వాలో చెబుతున్నాడు. ఇవ్వని వారి వ్యాపారం మూతపడినట్లే. ఎదురు తిరిగిన వారిని తొక్కుకుంటూ వెళతామని బెదిరిస్తున్నాడు. 

ఇప్పటికే నియోజకవర్గంలోని సహజ సంపద ఇతని కనుసన్నల్లో తరలిపోతోంది. ముఖ్యంగా కృష్ణంరెడ్డి పల్లి సమీపంలోని గుట్టలు కొల్లగొట్టారు. గ్రావెల్‌, మట్టిని వందల లోళ్లు తరలించి సొమ్ము చేసుకున్నా మైనింగ్‌ అధికారులు కిమ్మనలేదు. తాజాగా రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడి దారులపై వసూళ్ల దందాకు దిగారు.

డబ్బులిస్తారా.. పనులు ఆపేయాలా?!

‘ఇక్కడ మాదే రాజ్యం. మేము ఎంత చెబితే అంత. రూల్సు గీల్సూ ఉండవు. అధికారుల నుంచి అన్ని అనుమతులున్నా మా అనుమతి ఉండాల్సిందే’ అంటూ ఆయన దందా చేస్తున్నారు. అనంతపురం శివారులోని ఓ బిల్డర్‌ రెండు చోట్ల అపార్ట్‌మెంట్లు కట్టాడు. ఇటీవల ఆయన్ను పిలిపించి రూ.2 కోట్లు డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. ‘ఫ్లాట్‌లు అమ్ముడుపోక ఇబ్బందుల్లో ఉన్నా’నని బిల్డర్‌ చెప్పినా వినలేదు. డబ్బు ఇవ్వకపోతే ఫ్లాట్‌లు అమ్ముకోలేరని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో చివరకు రూ. కోటి ముట్టజెప్పి సెటిల్‌ చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

అనంతపురం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలోని హంపాపురం వద్ద ఐదుగురు కలిసి 9 ఎకరాల్లో విల్లా కోసం వెంచర్‌ వేశారు. వీరిని కొన్ని రోజుల క్రితం చిన్నోడు పిలిపించి రూ.3 కోట్లు డిమాండ్‌ చేసినట్టు బాధితులు వాపోయారు. మూడు దఫాలు తన మనుషులను పంపించి పనులను ఆపించడంతో చివరకు వారు వెళ్లి కలిశారు. ‘మేం గతంలో మీ నాన్న దగ్గర పనిచేశాం. మేం కూడా టీడీపీకి చెందిన వారమే’ అని వారు చెప్పుకున్నా.. ‘అది అదే, ఇది ఇదే..’అనడంతో కంగుతిన్నారు. 

ఇప్పటివరకూ ఒక్క రిజిస్ట్రేషన్‌ కూడా జరగలేదని, డబ్బులు ఇవ్వలేమని చెప్పగా.. వెంటనే అతని అనుచరులు తమ వద్ద ఉన్న డైరీ తీసి 9 రిజిస్ట్రేషన్‌లు జరిగాయని, ఆ విల్లాలు కొన్న వారి పేర్లతో సహా చెప్పడంతో వారికి మతిపోయినంత పనైంది. దీన్నిబట్టి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజూ ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే సమాచారం ఎప్పటికప్పుడు చిన్నోడికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వారు కూడా కొంత ముట్టజెప్పడంతో శాంతించారు.

పెట్టుబడులకు వెనకడుగు..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో రాప్తాడు ఒకటి. బెంగళూరు–హైదరాబాద్‌ జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో గతంలో పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీ నేత కుమారుల దెబ్బకు పెట్టుబడులు పెట్టే నాథులే కరువయ్యారు. వచ్చిన వారు కూడా ఆమడ దూరం పారిపోయారు. 

గడిచిన ఏడు నెలల్లో ఒక్క చిన్న పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ‘చిన్న రేకుల షెడ్డు వేసుకుని, ఏదైనా వ్యాపారం పెట్టుకున్నా వసూళ్లకు వస్తుంటే ఇక ఇక్కడ ఎందుకు పెట్టుబడి పెట్టాలి’ అని జిల్లాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త వాపోయారు. దీనికితోడు నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ నాయకులపై దాడులు, భూ ఆక్రమణలు షరా మామూలుగా మారడంతో సామాన్యులు కూడా భయకంపితులవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement