అనంతపురం క్రైం: పింఛన్‌దారుల పొట్ట కొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. పరిశీలన పేరుతో ఎసరు పెట్టేందుకు కసరత్తు ప్రారంభిస్తోంది. పింఛన్ డబ్బుతో ప్రతి నెలా వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు తీర్చుకుంటున్న దివ్యాంగులు, దీర్ఘకాలిక జబ్బుల బారిన పడిన వారిని లక్ష్యం చేసుకుంది. మెడికల్ టీంలను ఇంటి వద్దకే పంపి వడపోత పట్టాలని ఆదేశాలు చేసింది. సర్కారు చర్యలతో జిల్లాలోని లబ్ధిదారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ పింఛన్లు పొందుతున్న వారితో పాటు దివ్యాంగ పింఛన్లు జిల్లాలో 2,499 ఉన్నాయి. జనవరి 6 (నేడు) నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకూ ఆయా లబ్ధిదారుల పత్రాలను అధికారులు తనిఖీ చేయనున్నారు. నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి పరిశీలించనున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చిన సమయంలో ఇంటి వద్ద లేకపోతే పింఛన్ నిలిపివేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఈ క్రమంలో కూటమి సర్కారు కుట్రలపై పింఛన్‌దారులు మండి పడుతున్నారు. ఆరోగ్యం సరిగా లేని తాము వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ సమయంలో ఇంటి వద్దకు వచ్చి తొలగిస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో అన్ని వివరాలు సమగ్రంగా పరిశీలించాకే పింఛన్ మంజూరు చేశారని గుర్తు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు పరిశీలన పేరుతో అవమానించడం తగదని స్పష్టం చేస్తున్నారు.
చంద్రబాబు సర్కారు కుట్ర
పరిశీలన పేరుతో కుతంత్రం
ఆందోళనలో లబ్ధిదారులు
Comments
Please login to add a commentAdd a comment