అనంత వెంకటరెడ్డి చిరస్మరణీయులు
అనంతపురం కార్పొరేషన్: ఎన్నికల్లో గెలిచినా, ఓడినా వివాదాలకు తావివ్వకుండా ప్రజా సేవే పరమావధిగా పనిచేసిన మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి చిరస్మరణీయులని వక్తలు కొనియాడారు. అనంత వెంకటరెడ్డి 25వ వర్ధంతిని ఆయన తనయుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి వద్ద ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహానికి నాయకులు పుష్పాంజలి ఘటించారు. ఆస్పత్రి ఎదుట అన్నదానం చేశారు. అలాగే, బుక్కరాయ సముద్రం మండలం రోటరీపురం వద్ద ఉన్న అనంత వెంకటరెడ్డి ఘాట్ వద్ద అనంతతో పాటు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు రమేష్‌గౌడ్, రజక కార్పొరేషన్ మాజీ రాష్ట్ర చైర్మన్ మీసాల రంగన్న తదితరులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ నదీ జలాల విషయంలో అనంత వెంకటరెడ్డి విశేష పాత్ర పోషించారన్నారు. అందుకే దివంగత నేత వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో హంద్రీనీవాకు అనంత వెంకటరెడ్డి పథకంగా నామకరణం చేశారని గుర్తు చేశారు. టీడీపీ నేతలు కక్షపూరితంగా ఆయన పేరు తొలగించినా, ప్రజల గుండెల్లో నుంచి మాత్రం తొలగించలేరని స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు కృష్ణా జలాల మళ్లింపులో మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి కీలకపాత్ర పోషించారన్నారు.‘హంద్రీనీవా’కు ఉన్న అనంత వెంకటరెడ్డి పేరును కూటమి ప్రభుత్వం తొలగించడం బాధాకరమన్నారు. దివంగత నేత వైఎస్సార్ చలవతోనే 2012 నుంచి కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నాయన్నారు. హంద్రీనీవా ద్వారా 40 టీఎంసీలు తీసుకురావాలని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే అందుకు సంబంధించి జీఓ విడుదల చేశారని, కానీ, కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం దారుణమన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ అనంత వెంకటరెడ్డి చొరవతోనే జిల్లాకు న్యాయం జరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో అనంత వెంకటరెడ్డి అప్పట్లో కీలకపాత్ర పోషించారన్నారు. అనంతరం మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, వైఎస్సార్ సీపీ టాస్క్‌ఫోర్స్ సభ్యులు రమేష్ గౌడ్, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర తదితరులు మాట్లాడారు.
రాయలసీమకు కృష్ణా జలాల
మళ్లింపులో విశేష కృషి
మాజీ ఎంపీ వర్ధంతి కార్యక్రమంలో కొనియాడిన వక్తలు
కృష్ణా జలాల మళ్లింపులో కీలకపాత్ర
Comments
Please login to add a commentAdd a comment