ప్రచార ఆర్భాటం.. ఆచరణలో శూన్యం
అనంతపురం అర్బన్: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం నిర్వహించిన రెవెన్యూ సదస్సులు బుధవారంతో ముగిశాయి. మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో గత నెల 6న సదస్సులను ఆర్భాటంగా ప్రారంభించారు. 33 రోజుల పాటు 503 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు మొక్కుబడిగా సాగాయి. భూ సమస్యలపై అందిన ఫిర్యాదుల పరిష్కారానికి ఏ గ్రామంలోనూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన దాఖలాలు లేవు. మొత్తంగా ఈ సదస్సులు ఫిర్యాదుల స్వీకరణకే పరిమితమయ్యాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
వేలల్లో అర్జీలు..
కళ్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్లు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 503 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అధికారిక గణాంకాల ప్రకారం ఈ సదస్సులకు 44,093 మంది ప్రజలు హాజరయ్యారు. సదస్సుల్లో అందిన అర్జీలు 6,856 ఉండగా..పరిష్కరించింది కేవలం 1,750 అర్జీలే కావడం గమనార్హం.
● కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 151 గ్రామాల్లో నిర్వహించిన సదస్సులకు 15,436 మంది హాజరయ్యారు. భూ సమస్యలపై 1,439 అర్జీలు అందాయి. వీటిలో 584 అర్జీలు పరిష్కరించినట్లుగా చూపించారు.
● అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 198 గ్రామాల్లో నిర్వహించిన సదస్సులకు 13,635 మంది హాజరయ్యారు. భూ సమస్యలపై 2,585 అర్జీలు అందాయి. వీటిలో 692 అర్జీలు పరిష్కరించారు.
● గుంతకల్లు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 154 గ్రామాల్లో నిర్వహించిన సదస్సులకు 15,022 మంది హాజరయ్యారు. భూ సమస్యలపై 2,832 అర్జీలు అందాయి. వీటిలో 474 అర్జీలు పరిష్కరించినట్లుగా చూపించారు.
ముగిసిన రెవెన్యూ సదస్సులు
503 గ్రామాల్లో మొక్కుబడిగా సాగిన వైనం
అర్జీల స్వీకరణకే
పరిమితమైన అధికారులు
అందిన అర్జీలు 6,856, పరిష్కరించింది కేవలం 1,750
Comments
Please login to add a commentAdd a comment