అనంతపురం అగ్రికల్చర్: మార్కెటింగ్‌శాఖ నిర్ధేశించిన ఫీజులు, పన్నుల వసూళ్లకు సంబంధించి మార్కెట్ కమిటీల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. జిల్లాలో ఉన్న 9 మార్కెట్‌యార్డుల్లో నాలుగు కమిటీల పరిస్థితి మెరుగ్గా ఉండగా మరో ఐదు కమిటీలు వెనుకబడ్డాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓవరాల్‌గా మార్కెట్ కమిటీలకు మార్కెటింగ్‌శాఖ రూ.12.06 కోట్లు వసూళ్లు చేయాలని నిర్ధేశించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.7.75 కోట్ల సాధనతో 65 శాతం ప్రగతి సాధించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో అనంతపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ 73 శాతం లక్ష్యసాధనతో రూ.4.60 కోట్లకు గానూ రూ.3.37 కోట్ల వసూళ్లతో ముందంజలో ఉంది. ఆ తర్వాత రూ.1.44 కోట్లకు గానూ 70 శాతంతో రూ.1.01 కోట్లతో రెండో స్థానంలో రాయదుర్గం, రూ.70.88 లక్షలతో మూడో స్థానంలో శింగనమల, రూ.1.37 కోట్లతో నాలుగో స్థానంలో తాడిపత్రి ఉన్నాయి. మిగిలిన ఐదు కమిటీలు లక్ష్యానికి దూరం పయనం సాగిస్తున్నాయి. ఇందులో 30 శాతం వసూళ్లతో రాప్తాడు చిట్టచివరి స్థానంలో ఉండగా 37 శాతంతో గుత్తి, 46 శాతంతో ఉరవకొండ, 47 శాతంతో కళ్యాణదుర్గం, 48 శాతం వసూళ్లతో గుంతకల్లు మార్కెట్ కమిటీల్లో పన్ను వసూళ్లు నిరాశాజనకంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment