రోడ్డు ఆక్రమణకు ‘పచ్చ’ స్కెచ్
● బూదగవి జగనన్న కాలనీలో తమ్ముళ్ల బరితెగింపు
● మంత్రి కేశవ్ చెప్పారంటూ దౌర్జన్యం
ఉరవకొండ: మండల పరిధిలోని బూదగవి గ్రామంలో ‘పచ్చ’ నాయకులు బరి తెగించారు. ఏకంగా రోడ్డు ఆక్రమణకు స్కెచ్ వేశారు. వివరాలు.. బూదగవి గ్రామంలోని జగనన్న కాలనీలో సచివాలయానికి వెళ్లేందుకు వీలుగా 40 అడుగుల రోడ్డు ఉంది. ఈ రోడ్డును కబ్జా చేసేందుకు కొంతమంది టీడీపీ నాయకులు మంగళవారం అర్ధరాత్రి రంగంలోకి దిగారు. 10 మీటర్ల పొడువు 40 అడుగుల రోడ్డును జేసీబీతో చదును చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకోగా.. వారిపైనే దౌర్జన్యానికి దిగారు. మంత్రి కేశవ్ చెప్పడంతో ఆక్రమించుకుంటున్నామని చెప్పారని వైఎస్సార్ సీపీ నాయకుడు ధనంజయ తెలిపారు. దీనిపై గ్రామ వీఆర్‌ఓ కృష్ణకీర్తికి ఫిర్యాదు చేయగా రహదారి కోసం వదిలిన స్థలాన్ని కబ్జా చేసేందుకు వీలు లేదన్నారు. విషయాన్ని తహసీల్దార్ మహబూబ్‌బాషా దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లగా, చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
500 ఎకరాలకు పైగా
అడవి బుగ్గిపాలు
కుందుర్పి: గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం సాయంత్రం నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి కుందుర్పి మండలంలోని జంబుగుంపల అటవీ ప్రాంతం రెండు రోజులుగా కాలుతూనే ఉంది. మంటలు ఆర్పేందుకు అధికారులు చేపట్టిన చర్యలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. బుధవారం ఉదయానికి దాదాపు 500 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతంలో పచ్చని చెట్లు కాలి బూడిదయ్యాయి.
శతాధిక వృద్ధురాలు కన్నుమూత
ఉరవకొండ: మండల పరిధిలోని షేక్షానుపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మూత్తులూరు వెంకటలక్ష్మమ్మ (104) మంగళవారం రాత్రి కన్నుమూశారు. వెంకటలక్ష్మమ్మ భర్త ఓబన్న గతంలోనే చనిపోయారు. వీరికి ముగ్గురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు సంతానం. వయసు మీదపడినా వెంకటలక్ష్మమ్మ ఎంతో చురుగ్గా ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. తన పనులు తానే చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉండేవారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment