![రోగుల](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/ta-1_mr-1739131949-0.jpg.webp?itok=QFxsVlx2)
రోగుల నరకయాతన..
ఆగిన రాయదుర్గం ప్రభుత్వ
ఆస్పత్రి భవన నిర్మాణ
పనులు
● రాయదుర్గం ఏరియా ఆస్పత్రిలో సమస్యల తిష్ట
● తీవ్రంగా వైద్యులు, సిబ్బంది కొరత
● కీలక విభాగాల్లో కుర్చీలు ఖాళీ
● పేదలకు తప్పని ఇబ్బందులు
రాయదుర్గం: పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సరిపడా వైద్యులు, సిబ్బంది విధుల్లో ఉండేవారు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక బదిలీలు, ఇతర కారణాలు వెరసి 23 మంది వైద్యులకు గానూ ప్రస్తుతం 12 మంది మాత్రమే విధుల్లో ఉంటున్నారు. 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంటి డాక్టర్, చిన్నపిల్లలు, పంటి, ఈఎన్‌టీ, మత్తు, కాన్పులు, ఎముకలు, రేడియాలజీ లాంటి కీలక విభాగాలకు వైద్యులు లేకపోవడం గమనార్హం.
ఆస్పత్రిలో వైద్యులే కాకుండా నర్సులు, ఇతర విభాగాల్లో సరిపడునంత సిబ్బంది కూడా లేరు. మొత్తం 73 మంది సిబ్బంది అవసరముండగా, కేవలం 23 మంది ఉన్నారు. దీంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. ఇటీవల ఆస్పత్రి సందర్శనకు వచ్చిన డీసీహెచ్ పాల్ రవికుమార్ చిన్నపిల్లలు, ఎముకల డాక్టర్లతో పాటు ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామన్నా ఇప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆస్పత్రికి వచ్చే పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యూలో నిల్చోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక.. ఆస్పత్రిలో రోగులకు అందించే భోజనంలోనూ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేదలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం దుస్థితిని పారదోలాల్సి ఉంది.
కూటమి సర్కారు శాపం..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఆస్పత్రి రూపురేఖలు మారాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూ.కోట్ల విలువైన అత్యాధునిక యంత్రాలను సమకూర్చారు. సీహెచ్‌సీని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. నూతనంగా ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే 80 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక మిగిలిన పనులు మందగించాయి. 8 నెలలుగా నత్తతో పోటీ పడుతున్నాయి. దీంతో ఆస్పత్రిలో 40 బెడ్ల తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఒకే బెడ్డుపై ఇద్దరు లేదా ముగ్గురికి చికిత్సలందించాల్సిన దుస్థితి నెలకొంది.
![రోగుల నరకయాతన.. 1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09rdg01a-110064_mr-1739131949-1.jpg)
రోగుల నరకయాతన..
Comments
Please login to add a commentAdd a comment