హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త చాకలి నరసింహులుపై హత్యాయత్నం దారుణమని మండిపడ్డారు. అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు చాకలి నరసింహులును ఆదివారం సాయంత్రం గోరంట్ల మాధవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాకలి నరసింహులు క్రియాశీలకంగా ఉండేవాడన్నారు. పరిటాల సునీతమ్మ, పరిటాల శ్రీరామ్ డైరెక్షన్‌లోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. హత్యా రాజకీయాలను మొదలుపెడితే పరిటాల కుటుంబంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉండేవని గుర్తు చేశారు. ప్రశాంతతను చెడగొట్టేలా పరిటాల కుటుంబం వ్యవహరిస్తోందన్నారు. ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తే పుట్టగతులుండవని, ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్యా రాజకీయాలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు నాగముని, ధనుంజయయాదవ్, అమర్‌నాథ్‌రెడ్డి, గుంతపల్లి ఆనందరెడ్డి, మోహన్‌బాబు, సోమశేఖర్‌రెడ్డి ఉన్నారు.
‘పరిటాల’ డైరెక్షన్‌లోనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై హత్యాయత్నం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్
Comments
Please login to add a commentAdd a comment