![క్షీణిస్తున్న భూగర్భ జలం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09ang23a-110012_mr-1739131952-0.jpg.webp?itok=BhqaO8zQ)
క్షీణిస్తున్న భూగర్భ జలం
అనంతపురం అగ్రికల్చర్: శాసీ్త్రయ పద్ధతుల్లో భూగర్భజలాల స్థితిగతులు తెలుసుకునే నిమిత్తం జిల్లా వ్యాప్తంగా 31 మండలాల పరిధిలో 97 ఫిజోమీటర్లు ఏర్పాటు చేశారు. భూగర్భ జలశాఖ తాజాగా సేకరించిన గణాంకాల ప్రకారం జిల్లా సగటు నీటి మట్టం 9.73 మీటర్లుగా నమోదైంది. 17 మండలాల పరిధిలో ఉన్న 29 ఫిజోమీటర్ల పరిధిలో భూగర్భజలాలు క్షీణిస్తున్నట్లు గుర్తించినట్లు ఆ శాఖ డీడీ కె.తిప్పేస్వామి తెలిపారు. యాడికి మండలం రాయలచెరువు ఫిజోమీటర్‌లో గరిష్టం 36.36 మీటర్లలో నీటిమట్టం కనిపిస్తుండగా, అదే మండలం నగరూరులో 31.17 మీటర్లు, శెట్టూరు ఫిజోమీటర్‌లో 28.12 మీటర్లలో కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నీటి కన్నా అధికంగా వినియోగిస్తుండటం వల్ల వేసవిలో అక్కడక్కడా సమస్య తలెత్తే పరిస్థితి ఉందన్నారు. గతేడాది ఇదే సమయంలో సగటు నీటి మట్టం 11.20 మీటర్లుగా నమోదైందని, ఈ సారి మాత్రం 29 ఫిజోమీటర్ల పరిధిలో క్షీణిస్తుండటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.
30 శాతం అధికంగా వర్షపాతం..
ఈ వర్షపు సంవత్సరానికి సంబంధించి గత జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 460.7 మి.మీ గానూ 30 శాతం అధికంగా 601.9 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో 14 మండలాల్లో భూగర్భజలాలు కొంత మెరుగ్గానే ఉన్నా మిగతా మండలాల్లో కొంత తగ్గుతున్నట్లు గుర్తించారు. అనంతపురం, బెళుగుప్ప, బ్రహ్మసముద్రం, డీ.హీరేహాళ్, గుత్తి, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, కంబదూరు, కణేకల్లు, కూడేరు, కుందుర్పి, నార్పల, పామిడి, పుట్లూరు, శెట్టూరు, తాడిపత్రి, యాడికి... తదితర 17 మండలాల్లో భూగర్భజలాలు ఒత్తిడికి గురవుతున్నట్లు గుర్తించారు. ఆయా మండలాల్లో నీటిని అధికంగా వినియోగించే వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేయకుండా ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలని భూగర్భజలశాఖ సిఫారసు చేసింది. ఉపాధి హామీ పథకం కింద విరివిగా నీటికుంటల నిర్మాణాలు చేపట్టి వాన నీటిని ఎక్కడిక్కడ ఇంకేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. పంటల సాగు, డ్రిప్ ద్వారా నీటి ఆదా చర్యలు చేపట్టాలని సిఫారసు చేశారు.
జిల్లా తాజా సగటు నీటి మట్టం
9.73 మీటర్లు
17 మండలాల్లో అధికంగా నీటి ఒత్తిడి
Comments
Please login to add a commentAdd a comment