సాక్షి, అమరావతి: రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. విజయవాడలో మంగళ, బుధవారాల్లో (21, 22 తేదీల్లో) నిర్వహిస్తున్న ‘వాణిజ్య ఉత్సవ్’ను ఇందుకు వేదికగా వినియోగించుకుంటోంది. రాష్ట్రం నుంచి అత్యంత చౌకగా ఎగుమతులు చేసుకునే అవకాశాలను ఎగుమతుదారులకు వివరించే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీ ఈడీబీ) ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి నాలుగు ఓడ రేవుల ద్వారా 16.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరగ్గా వీటిని 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ ఈడీబీ సీఈవో జె.వి.ఎన్.సుబ్రమణ్యం తెలిపారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ఎగుమతులకు ఉన్న అవకాశాలు, లాజిస్టిక్, ఎంతచౌకగా ఎగుమతులు చేయగలమన్న వివరాలను ఈ రెండు రోజుల సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ఎగుమతిదారులకు వివరించనున్నారు.
2020–21లో 159 ఎంఎంటీల సరుకు రవాణా
ప్రస్తుతం మన రాష్ట్రంలోని పోర్టులకు 253.89 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీల) సరుకు రవాణా సామర్థ్యం ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విశాఖ పోర్టుకు 127 ఎంఎంటీల సామర్థ్యం ఉంది. రాష్ట్రానికి చెందిన గంగవరం పోర్టు 64 ఎంఎంటీలు, కాకినాడ పోర్టు 18 ఎంఎంటీలు, కృష్ణపట్నం పోర్టు 45 ఎంఎంటీల సామర్థ్యంతో ఉన్నాయి. 2020–21లో రాష్ట్రంలోని పోర్టుల ద్వారా 159 ఎంఎంటీల సరుకును రవాణా చేయడం ద్వారా దేశంలో రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్ రాష్ట్రం 412 ఎంఎంటీల సరుకు రవాణాతో మొదటి స్థానంలో ఉంది. కొత్తగా రాష్ట్రంలో నిర్మిస్తున్న నాలుగు పోర్టులు అందుబాటులోకి వస్తే సరుకు రవాణా నిర్వహణ సామర్థ్యం 450 మిలియన్ టన్నులకు చేరనుంది.
రాష్ట్రంలో నిర్వహణ వ్యయం చాలా తక్కువ
రాష్ట్రానికి వచ్చిన ఓడ అత్యంత తక్కువ సమయంలో సరుకును దిగుమతి, ఎగుమతి చేసుకుని వెళ్లే అవకాశం ఉండటంతో ఎగుమతిదారులకు వ్యయం చాలా తగ్గుతోంది. రాష్ట్ర పోర్టులైన గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల టర్న్ ఎరౌండ్ సమయం (సరుకు దింపి నింపుకొని వెళ్లే సమయం) 1.5 రోజులు. విశాఖ పోర్టు టర్న్ ఎరౌండ్ సమయం 2.51 రోజులు. దేశంలో ఇంత తక్కువ టర్న్ ఎరౌండ్ మన రాష్ట్రంలోనే ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ నాలుగు పోర్టుల్లో 39 బెర్తులున్నాయి. వీటిలో 57 శాతం బల్క్ కార్గో నిర్వహించేవి కావడం కూడా తక్కువ టర్న్ ఎరౌండ్‌కు ఒక కారణం. దీనికితోడు ఎగుమతులు, దిగుమతులకు అవసరమైన లాజిస్టిక్స్ ఉండటం కూడా కలిసి వస్తోంది. రాష్ట్రంలో 13.38 లక్షల టన్నుల సరుకును నిల్వ చేసుకునే విధంగా 109 గిడ్డంగులు అందుబాటులో ఉన్నాయి. 104 కోల్డ్ స్టోరేజీలు, 3 ఇన్‌లాండ్ కంటైనర్ డిపోలు (ఐసీడీ), 15 కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఉన్నాయి. సరుకు రవాణా వ్యయం మరింత తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్ పాలసీ ద్వారా ఈ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment